మీ సేవా కేంద్రాల్లో అధిక చార్జీలు వసూలు చేయొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ జడ్చర్ల: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మీసేవా సెంటర్లను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీసీ నిర్వహించి మాట్లాడారు. అధిక మొత్తంలో డబ్బులు తీసుకోకుండా మీసేవ సెంటర్ల నిర్వాహకులను నియంత్రించాలని సూచించారు. సీఎం, కలెక్టర్ ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చెప్పారు. 22ఏలో ఫాం–1, ఫాం–2 మళ్లీ ఒకసారి పరిశీలించాలని, భూ భారతి దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలన్నారు. ఎన్నికల ఓటరు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన కావేరమ్మపేటలో మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోదారులతో మాట్లాడి మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ధ్రువీకరణ పత్రాల జారీకి ఎంతమేరకు రుసుం తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మాత్రమే రుసుం తీసుకోవాలని అంతకు మించి అధికంగా వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే మీసేవ కేంద్రాలు ఎవరి పేరు మీద ఉంటే వారే నిర్వహించాలని, కేంద్రాలను అద్దెకు ఇవ్వడం వంటివి చేస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
పాఠశాలల ఆకస్మిక తనిఖీ..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని రాంనగర్, కొనపాలమూరు పాఠశాలలను అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పదోతరగతి విద్యార్థులకు ప్రణాళికబద్ధంగా తరగతులు బోధించాలని సూచించారు.


