ముసాయిదా ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి సరిచేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న 200 పోలింగ్ కేంద్రాలను అవసరమైతే 270కి పెంచాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను జాగ్రత్తగా పూర్తిచేయాలని, ఆయా పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయవంతం చేసేందుకు అందరూ సన్నద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఇన్‌చార్జి ఎంఈ విజయ్‌కుమార్, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఓలు యాదయ్య, మహమ్మద్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
తప్పొప్పులను సరిచేయాలని వినతి
నగరంలోని డివిజన్ నం.40లో నివసిస్తున్న తనతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితాలో డివిజన్ నం.57లో చూపించడం తగదని డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజే బెన్‌హర్ అన్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డివిజన్ నం.40లో నాగర్‌కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేటకు చెందిన కొందరు పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే ఎంతో దూరంలో ఉన్న బొక్కలోనిపల్లి, బండమీదిపల్లి, ఏనుగొండలో నివసిస్తున్న వారి పేర్లు సైతం ఇందులోనే ఉన్నాయని ఆరోపించారు. ఇలా ఎన్నో తప్పొప్పులు జరిగాయని వాటన్నింటినీ వెంటనే సరిచేయాలని విన్నవించారు.


