మన హక్కులపై మాట్లాడేందుకు భయమెందుకు?
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణానీటిలో తెలంగాణ హక్కులపై మాట్లాడేందుకు కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఎలాంటి హక్కు ఉండదని చెప్పారు. వాస్తవానికి మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణ వాటా 574 టీఎంసీలు రావాలన్నారు. గతంలో కేటాయించిన వాటా తాత్కాలిక సర్దుబాట్ల కోసం చేసిందే తప్ప శాశ్వతం కాదని చెప్పారు. ప్రభుత్వాలు ఏవైనా ప్రజల హక్కులను కాపాడాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు పదవులు అలంకార ప్రాయంగా మారాయని దుయ్యబట్టారు. వాటిని బిరుదులుగా భావించకుండా బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పనుల్లో అతీగతీ లేదని విమర్శించారు. హెలికాప్టర్‌లో తిరిగేందుకే మంత్రుల ఆరాటం తప్ప ప్రాజెక్ట్ పనులపై లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 36 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉంటే ఇప్పటికీ 7లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోందన్నారు. ప్రజల సాగునీటి హక్కుల కోసం ఉద్యమిస్తానని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఆపనని స్పష్టం చేశారు.
● కృష్ణానీటిలో తెలంగాణ హక్కులను కాపాడాలి
● మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి


