భక్తిశ్రద్ధలతో మన్యంకొండకు పాదయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం మన్యంకొండకు మహాపాదయాత్ర చేపట్టారు. బ్రాహ్మణవాడిలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బండమీదిపల్లి, ధర్మాపూర్ మీదుగా మన్యంకొండ దేవస్థానం వరకు నిర్వహించారు. వందలాది మంది భక్తులు గోవిందనామ, హరి నామ సంకీర్తనలతో పాదయాత్ర చేపట్టారు. అనంతరం భక్తులు మన్యంకొండ శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు గొండ్యాల రాఘవేంద్రశర్మ మాట్లాడుతూ ఇలాంటి యాత్రలు చేయడం వల్ల హిందువుల్లో ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. భక్తిమార్గం దిశగా యువతను నడిపించడానికి ఇలాంటి పాదయాత్రలు చాలా ఉపయోగపడుతాయన్నారు. ధనుర్మాసంలో విష్ణు క్షేత్రాన్ని దర్శించుకోవడం మోక్షదాయకమని పేర్కొన్నారు. గుండ వెంకటేశ్వర్లు, తల్లం నాగరాజు, సూది రాము, రాఘవ, రాఘవేందర్‌శర్మ పాల్గొన్నారు.


