విద్యారంగం.. పురోగమనం
పాలమూరు విశ్వవిద్యాలయంలో..
● పాలమూరులో ట్రిపుల్ ఐటీ, జవహర్ నవోదయ, న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలకు అడుగులు
● విద్యానిధి ద్వారా ఉచిత ఐఐటి, నీట్ శిక్షణ
ఈ ఏడాది పాలమూరు విశ్వవిద్యాలయంలో 4వ స్నాతకోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, ఛాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరయ్యారు. చదువులో ప్రతిభ కనబర్చిన 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. న్యాయ, ఇంజినీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేయడంతో పాటు వసతిగృహ, కళాశాలల భవన నిర్మాణాలు కూడా ప్రారంభించారు. గద్వాల, కొల్లాపూర్ పీజీ సెంటర్‌లో హాస్టల్స్ ప్రారంభించారు. పీయూలోని అన్ని విభాగాల్లో డిజిటలైజేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మైగ్రేషన్, కాన్వగేషన్, మార్కుల మెమోలు తదితరాలకు విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. పీయూ పరిధిలోని 80 కళాశాలల్లో 42 వేల మంది విద్యార్థులు చదువుతున్న వారికి ప్రయోజనం కలగనుంది. సిబ్బందికి ఈపీఎఫ్ అమలు, వేతనాల పెంపు వంటి నిర్ణయాలు అధికారులు తీసుకున్నారు. పీయూ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన మన్నె సత్యనారాయణరెడ్డి యూనివర్సిటీకి రూ.10 కోట్లు విరాళం ఇవ్వగా.. భారీ ఆడిటోరియం నిర్మించనున్నారు.


