బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
అడ్డాకుల: మూసాపేట మండలం వేములలో అత్యాచారానికి గురై మృతిచెందిన యువతి కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన వేములలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన జరిగిన రోజు వివరాల గురించి కుటుంబ సభ్యులతో ఆరా తీశారు. తర్వాత బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం కింద మంజూరైన రూ.3.47 లక్షల చెక్కును అందజేశారు. మిగతా రూ.65 వేలను కలెక్టర్‌తో మాట్లాడి త్వరగా అందజేసేలా చొరవ తీసుకుంటానని వెల్లడించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి జిల్లాకేంద్రంలో డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేసేలా చూడాలని, లేకపోతే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, ప్రభుత్వ భూమి అందజేసేలా తాను ప్రత్యేక చొరవ తీసుకుంటానని వెల్లడించారు. నిందితులకు కఠిన శిక్ష విధించినప్పుడే యువతి మృతికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్, సీఐ అప్పయ్య, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎస్‌ఐలు వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.


