సొంత గూటికి కార్యాలయాలు
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఏదేని ప్రభుత్వ భవనం ఖాళీగా ఉంటే మార్చాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ఎక్కడైనా ప్రభుత్వ భవనం ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అక్కడికి తరలించేలా చర్యలు తీసుకుంటాం. – సమ్మయ్య, సబ్ రిజిస్ట్రార్, జడ్చర్ల
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)/ జడ్చర్ల: అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మారాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు పలు శాఖలకు సంబంధించి కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతూ.. ప్రతినెలా అద్దె రూపంలో రూ.వేలు చెల్లిస్తుంటే.. మరోవైపు ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ భవనాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రతినెలా చెల్లిస్తున్న అద్దెను మిగిల్చుకోవడంతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలన్నింటినీ ఈ నెల 31 వరకు ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఆదేశిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రామకృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా అద్దె భవనాలను ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి కార్యాలయాలను మార్చకుంటే వాటికి చెల్లించే అద్దె డబ్బులు నిలిపివేయాలని రాష్ట్ర ట్రెజరీ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనికి రెండు రోజులే గడువు ఉండటంతో అద్దె భవనాల్లో సాగుతున్న కార్యాలయాల అధికారులు ఖాళీ భవనాల అన్వేషణలో నిమగ్నమయ్యారు. నిర్వహణకు అవసరమైన వసతులతో కూడిన భవనాలు కేటాయించేలా చూడాలని జిల్లా ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు.
భారం తగ్గించడంపై దృష్టి
జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్, టీజీ ఎల్‌ఐీసీ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇవే కాకుండా జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల కోఆర్డినేటర్ల కార్యాలయాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. వీటికి ప్రతినెలా ప్రభుత్వం రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తోంది. ఇది ప్రభుత్వానికి అదనపు భారంగా మారింది. ప్రస్తుతం అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలో టీటీడీ కల్యాణ మండపం ముందున్న ఆర్‌అండ్‌బీ కార్యాలయంలోకి రిజిస్ట్రేషన్ శాఖను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
బాదేపల్లిలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనం ఖాళీగా ఉంది. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.10 లక్షలు వెచ్చించి మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా.. పిల్లరు, స్లాబు వరకే నిర్మించారు. జాతీయ రహదారి–44ని అనుసరించి నిర్మించిన రెండు భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. బాదేపల్లి మార్కెట్ యార్డు సమీపంలో దాదాపు రూ.2 కోట్లు వెచ్చించి రైతు బజార్ నిర్మించి.. వృథాగా వదిలేశారు. పత్తి మార్కెట్ యార్డులో నిర్మించిన దాదాపు 20 దుకాణ సముదాయాలు నిరుపయోగంగా మారాయి.
కొనసాగితే భాధ్యత వారిదే..
ఈ నెల 31లోగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను సర్కారు భవనాల్లోకి మార్చాలని ఆదేశించింది. గడువులోగా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చకపోతే ఫిబ్రవరి 1 నుంచి వాటికి చెల్లించే అద్దె డబ్బులు నిలిపివేయాలని ప్రభుత్వ ఖజానా శాఖను ఆదేశించింది. అప్పటికి అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగితే సంబంధిత పరిపాలనా అధికారులే బాధ్యులవుతారని స్పష్టం చేసింది.
దూరదృష్టి లేకపోవడంతో..
పాలకులు, అధికారులు దూర దృష్టి సారించకపోవడంతో జడ్చర్లలో పలు భవనాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఉన్న భవనాలను వృథాగా వదిలివేయడంతో శిథిలావస్థకు చేరగా కొత్తగా చేపట్టిన భవనాలు అసంపూర్తి దశలోనే ఆగిపోయాయి. ఇటీవల రూ.కోటి వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనం కూడా ఇరుగ్గా మారిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ఈ కోవలోనే ఉన్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు దృష్టిసారించి అసంపూర్తి దశలో ఉన్న భవనాల పనులు పూర్తి చేసేందుకు, వృథాగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అద్దె భవనాలు ఖాళీ చేసి ప్రభుత్వ భవనాల్లోకి మారాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
అద్దె భవనాలు ఖాళీ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
ఈ నెలాఖరు వరకు గడువు విధింపు
జడ్చర్లలో ఖాళీగా పలు భవనాలు.. ఇప్పటికై నా వినియోగిస్తే మేలు
సొంత గూటికి కార్యాలయాలు
సొంత గూటికి కార్యాలయాలు


