ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు
మహబూబ్‌నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని హనుమద్దాసుల మండపం వద్దకు తీసుకువచ్చి అలంకరించి విశేష పూజలు జరుపుతారు. ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. దిగువకొండ వద్దనున్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకలకు పటిష్ట భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే యువత, ఇతరులు ఎవరైనా వేడుకల పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని చెప్పారు. బుధవారం రాత్రి, గురువారం నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా నగరంలో బైపాస్ రహదారి వెంబడి నిరంతరం పెట్రోలింగ్ వాహనాలు గస్తీ తిరుగుతాయని, ఈ మార్గంలో రాష్ డ్రైవింగ్, రైడింగ్, రేసింగ్, స్టంట్స్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడరాదని, ఒకవేళ అలా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఆర్గనైజ్ కార్యక్రమాలు నిర్వహించే వారికి పోలీస్ అనుమతి లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలో చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, టపాసులు పేల్చడం, డీజేలు పెట్టడం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చెప్పారు. నగరంలో రోడ్లు బ్లాక్ చేసి వేడుకలు జరపరాదని, మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలని ఆదేశించారు.
ఓపెన్ స్కూల్ తరగతుల తనిఖీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లలో ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ స్కూల్ తరగతులను ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శివయ్య జిల్లాకేంద్రంలోని గాంధీరోడ్డు, మోడల్ బేసిక్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కేవలం ఆదివారం నిర్వహించే తరగతులకు హాజరైతే సులువుగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు. పరీక్ష ఫీజులు వచ్చేనెల 5 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్, ఇంటర్ వారికి ప్రాక్టికల్స్ అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భాస్కర్, ఉపాధ్యాయులు శశిధర్, శివసాయి తదితరులు పాల్గొన్నారు.
భారీగా ధాన్యం రాక
నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 22,189 బస్తాల వరిధాన్యం వచ్చింది. వేలాది బస్తాల ధాన్యం రావడంతో యార్డులో ఎక్కడ చూసిన ధాన్యం రాసులే కనిపించాయి. కాగా వరి క్వింటాల్ రూ.2,790 ఒకేధర లభించిందని మార్కెట్ అధికారి రమేశ్ తెలిపారు.
ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు
ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ ముస్తాబు


