తండ్రి ప్రాణం తీసిన కుమారుడి వివాహేతర బంధం
రూ.8 లక్షలకు సుపారీ..
● హమాలీ హత్య కేసును ఛేదించిన పోలీసులు
● నిందితుల అరెస్టు
● వివరాలు
వెల్లడించిన డీఎస్పీ
వెంకటేశ్వర్లు
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలం అడవి అజిలాపూర్ స్టేజీ వద్ద గత అక్టోబర్ 24న జరిగిన హమాలీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అజిలాపూర్‌కు చెందిన దానం మైబు (45) దేవరకద్రలోని మార్కెట్‌యార్డులో హమాలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అక్కినోళ్ల రాజు, హనుమన్న, రాఘువులు ముగ్గురు అన్నదమ్ములు కాగా.. చిన్నవాడైనా రాఘవులు భార్యతో మృతుడి కొడుకు అనిల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాఘవులు.. మూడేళ్ల క్రితం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఘటనకు కారణమైన అనిల్‌ను గ్రామం నుంచి హైదరాబాద్‌కు పంపించారు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అక్కినోళ్ల హనుమన్న భావించాడు. ఈ మేరకు చిన్నరాజమూరుకు చెందిన మ్యాదరి చిన్న రాములు సహాయంతో మహబూబ్‌నగర్‌లోని దొడ్డలోనిపల్లికి చెందిన గొల్ల మల్లేష్, మణికొండకు చెందిన శరత్‌ను ఆశ్రయించాడు.
తన తమ్ముడి చావుకు కారణమైన అనిల్ లేదా అతడి తండ్రి దానం మైబును హతమార్చేందుకు గాను గొల్ల మల్లేష్, శరత్‌తో హనుమన్న రూ. 8 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. హత్యకు ముందు రూ. 3.90 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. అయితే అనిల్ హైదరాబాద్‌లో ఉండటంతో, తండ్రి దానం మైబును హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారు. అందుకోసం వారం రోజులుగా మృతుడి కదలికలపై నిఘా ఉంచారు. అక్టోబర్ 24న మృతుడు దేవరకద్ర మార్కెట్‌యార్డులో పనులు ముగించుకొని బైక్‌పై ఒంటరిగా ఇంటికి వెళ్తుండటాన్ని గమనించిన నిందితులు.. అజిలాపూర్ స్టేజీ వద్ద బైక్‌ను అడ్డగించి తమతో తెచ్చుకున్న వేట కొడవళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారి నుంచి మైబు తప్పించుకొని పారిపోతుండగా.. వెంబడించి మరీ ఇష్టానుసారంగా నరకడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత నిందితులు తమ వేట కొడవళ్లను సమీపంలోని నీటి గుంతలో వేసి వెళ్లిపోయారు. ఈ హత్యను పలు కోణాల్లో విచారించిన పోలీసులు.. కాల్‌డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఏ–1గా అక్కినోళ్ల హనుమన్న, ఏ–2గా గొల్ల మల్లేష్, ఏ–3గా గంజి శరత్, ఏ–4, మ్యాదరి చిన్నరాములును చేర్చినట్లు తెలిపారు. వీరిలో ఏ–3 నిందితుడు గంజి శరత్ పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన అభంగాపూర్ ఆశన్నను చంపిన వారిలో ఏ–6 ముద్దాయిగా ఉన్నాడన్నారు. అదే విధంగా హమాలీని హత్యచేసిన వారం రోజులకు దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన ఒక యువకుడిని మణికొండలో హత్య చేశాడని.. ఆ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడని తెలిపారు. మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసు ఛేదనకు కృషిచేసిన ఎస్‌ఐ నాగన్న, కానిస్టేబుల్ రాజశేఖర్, నాను నాయక్‌లను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ రామకృష్ణ ఉన్నారు.


