ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు..
2014లో జీఓ 68 విడుదల..
మా పూర్వీకుల స్వగ్రామం అసద్‌పూర్. శ్రీశైలం బ్యాక్‌వాటర్ కారణంగా మా ఊరంతా మునిగిపోయి సర్వం కోల్పోయాం. ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 98, 68 అమలు కోసం ఎదురుచూస్తున్నాం. నిర్వాసితుల్లో చాలా మంది పేదరికంతో చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలి. – మేనుగొండ రాముయాదవ్,
శ్రీశైలం నిర్వాసితుడు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. జటప్రోల్ సభలో నిర్వాసితుల అంశంపై నివేదిక తయారు చేయాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుకు సూచించారు. నిర్వాసితుల వివరాలు, ఉద్యోగాల ఖాళీలు వంటి అంశాలపై కలెక్టర్లతో చర్చించామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
– డాగోజీరావు, శ్రీశైలం నిర్వాసితుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కొంతకాలంగా నిర్వాసితులు మమ్మల్ని కలుస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఇతరులతో కూడా వారు చర్చించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. 98, 68 జీఓలపై ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ
శ్రీశైలం ప్రాజెక్టు పేరు చెప్పి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆశచూపి.. ఇళ్లు, భూములు లాక్కున్నారు.. ఊళ్లకుఊళ్లు ఖాళీ చేయించి.. ఏటి ఒడ్డున పడేశారు.. ఏళ్లకు ఏళ్ల తరబడి ఏ ఒక్కరూ మా గోస పట్టించుకోలేదు. అధికారులకు ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి.. ప్రజాప్రతినిధులు గుప్పించిన హామీలు నీటిమూటలయ్యాయి.. కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులరిగాయి.. వయస్సు మీదబడి అలసిపోయాం.. అయ్యా, సీఎం గారూ.. మీరైనా సొంత జిల్లావాసులపై కనికరం చూపి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ శ్రీశైలం నిర్వాసితులు వేడుకుంటున్నారు.
కొల్లాపూర్: దశాబ్దాల కాలంగా శ్రీశైలం నిర్వాసితుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. శ్రీశైలం డ్యాం నిర్మాణంతో భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 98ను విడుదల చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లాలో దాదాపు 70 శాతం మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వగా.. తెలంగాణలో జీఓ 98 అమలుకు నోచుకోలేదు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి న్యాయం చేస్తామని నాలుగు దశాబ్దాలుగా పాలకులు ఇస్తున్న హామీలు నీటమూటలుగానే మారుతున్నాయి. జీఓ అమలు కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేసిన శ్రీశైలం నిర్వాసితులు.. న్యాయపోరాటం సైతం చేస్తున్నప్పటికీ పాలకుల్లో చలనం రావడం లేదు.
కృష్ణానది తీరంలో పునరావాస గ్రామం మంచాలకట్ట
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఉమ్మడి పాలమూరు, కర్నూలు జిల్లాల్లోని పలు గ్రామాలు కృష్ణా బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయాయి. 1970– 82 మధ్యకాలంలో అధికారులు నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో వారు నది తీరంలోనే కొత్తగా నివాసాలు ఏర్పాటు చేసుకోగా.. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ 98 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని.. చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆ జీఓ ప్రకారం కర్నూలు జిల్లాలో వేలాది మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించిన గత ప్రభుత్వాలు.. పాలమూరు నిర్వాసితులను పట్టించుకోలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2,318 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఐదుగురికి 1993లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మరో 30 మందికి, 2015లో కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 128 మంది నాన్ లోకల్ కోటా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన లష్కర్ ఉద్యోగాలు కల్పించారు. వీరిలో ఐదుగురి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారు. ఈ ఏడాది కోర్టు ఆదేశాల ప్రకారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ 12 మంది నిర్వాసితులకు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 175 మంది నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మిగిలిన వారిలో 633 మంది మరణించగా.. 410 మంది వయసు పైబడి ఉద్యోగార్హత కోల్పోయారు. ఇక మిగిలింది 1,206 మంది మాత్రమే. అయితే వీరే కాకుండా.. పలువురు నిర్వాసితులు ఉద్యోగాల అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక స్థానిక నేతలు నిర్వాసితుల సమస్యను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్హులైన వారికి ఉద్యోగాలకు బదులుగా నగదు ప్యాకేజీ అందించాలని భావించారు. అది కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, ఈ ఏడాది జటప్రోల్ సభలోనూ నిర్వాసితుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు నిర్వాసితులు మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. కానీ, సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు.
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా..
ప్రజాప్రతినిధులు మారినా తీరని గోస
బుట్టదాఖలైన వినతులు..
నీటిమూటలైన హామీలు
ఎన్ని పోరాటాలు చేసినా
అమలుకాని 98, 68 జీఓలు
సొంత జిల్లావాసులపై ముఖ్యమంత్రి
కనికరం చూపాలని వేడుకోలు
జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రమే నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలనే నిబంధన ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2014లో జీఓ 68 జారీ చేసింది. దీన్ని ప్రకారం ఏ ప్రాజెక్టులోనైనా సరే నిర్వాసితులకు కనీసం గ్రూప్–4 స్థాయి ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు ఈ జీఓను అమలుపర్చలేదు. 2015లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు పాలమూరులో 173 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు నిర్వాసితులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా.. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ఉమ్మడి జిల్లాలో 175 మందికే ఉద్యోగాలు..


