రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 24 గంటల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఈఈ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని క్రిస్టియన్ పల్లి వద్ద 1200 ఎంఎం పైప్‌లైన్ రోడ్డు విస్తరణలో భాగంగా మార్చాల్సి ఉండడంతో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు. దీంతో రాంరెడ్డి గూడెం నీటిశుద్ధి ప్లాంట్ నుంచి మహబూబ్‌నగర్ నగరానికి పాక్షికంగా, మన్యంకొండ నీటి శుద్ధీకరణ ప్లాంట్ నుంచి వెళ్లే మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర మున్సిపాలిటీలకు పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ప్రజలు ఈ అసౌకర్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నవాబుపేట మార్కెట్‌కు భారీగా ధాన్యం
నవాబుపేట: మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డుకు ఆదివారం 8,540 బస్తాల వరిధాన్యం, 6,104 బస్తాల మొక్కజొన్న అమ్మకానికి వచ్చింది. వరిధాన్యం క్వింటాల్ గరిష్టంగా రూ. 2,815, కనిష్టంగా రూ. 2,719 ధర పలికింది. మొక్కజొన్న గరిష్టంగా రూ. 1,934, కనిష్టంగా రూ. 1,808 ధర వచ్చింది. వచ్చే వారం పెద్ద మొత్తంలో వరిధాన్యం అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ లింగం, కార్యదర్శి రమేశ్ తెలిపారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సీనియర్ టోర్నీలో జిల్లా జట్టు విజేతగా నిలవాలని సీనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడు, జడ్చర్ల ఎస్‌ఐ అక్షయ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా పురుషుల సాఫ్ట్‌బాల్ జట్టు క్యాంప్‌ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ నిరంతరం ప్రాక్టీస్‌తో క్రీడల్లో విజయం సాధించవచ్చని అన్నారు. టోర్నీలో చాంపియన్‌గా నిలిచి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌బాల్ సంఘం సభ్యులు నాగరాజు, రాఘవేందర్, సీనియర్ క్రీడాకారుడు ఆది లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
రేపు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్


