ఆధునిక హంగులు
రూ.16.40 కోట్ల అభివృద్ధి పనులు..
● సెంట్రలైజ్డ్ ఏసీకి రూ.2.70 కోట్లు
మంజూరు
● ఉమ్మడి జిల్లాకే తలమానికం
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరులోని ప్రధాన స్టేడియంలో రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నీలు జరిగేలా సుమారు రూ.7.79 కోట్లతో అధునాతన సౌకర్యాలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. ఇండోర్ స్టేడియంలోని రెండు అంతస్తుల్లో టేబుల్ టెన్నిస్ హాల్, బాక్సింగ్ హాల్‌తో పాటు స్టోర్ రూములు, క్రీడాకారుల వసతి గదులు ఉన్నాయి. క్రీడాభిమానులు పోటీలు తిలకించడానికి రెండువైపులా గ్యాలరీలు ఏర్పాటు చేసి సీట్లు బిగించారు. స్టేడియం లోపల ఉడెన్ కోర్టులో నాలుగు సింథటిక్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జులైలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రూ.42 లక్షలతో జర్మన్ టెక్నాలజీతో అధునాతన మైక్‌సిస్టం అమర్చారు. చుట్టూ 16 స్పీకర్లు, 8 ఆంప్లిఫయర్లు, 4 ఊఫర్లు, 4 కార్డ్‌లెస్‌లు ఉన్నాయి.
రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు..
మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు వేదికగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ఫాస్ట్–5 జాతీయస్థాయి సీనియర్ నేషనల్ నెట్‌బాల్, సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ, నెట్‌బాల్ పోటీలతో పాటు రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ జరిగింది. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి.
నియోజకవర్గంలో రూ.16.40 కోట్లతో క్రీడాభివృద్ధి పనులు జరగనున్నాయి. పనులకు సంబంధించి జీఓ కూడా జారీ అయింది. ఈ నిధుల నుంచి ఇండోర్ స్టేడియంలో రూ.2.70 కోట్లతో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోనే ఓ అధునాతన ఇండోర్ స్టేడియంగా తీర్చిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఏసీ ఏర్పాటైతే ఇండోర్ గేమ్స్ ఆడే క్రీడాకారులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది. క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం ఎంతో వెసులుబాటు లభిస్తుంది. ఇండోర్ స్టేడియంలో అధునాతన వసతులు కల్పిస్తుండటంతో సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


