యాసంగి బోనస్ హుష్‌కాకి?
● జిల్లాలో బకాయి రూ. 51.85 కోట్లు
● బోనస్ కోసం రైతన్నల ఎదురు చూపు
● తాజాగా వానాకాలం బోనస్
మాత్రమే జమ
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో యాసంగి(రబీ) సీజన్‌లో సన్న రకం ధాన్యం అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.51.85 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉంది. ధాన్యానికి మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రబీ సీజన్‌కు సంబంధించిన నేటివరకు రైతులకు బోనస్ పూర్తిస్థాయిలో ఇవ్వకుండానే.. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించిన బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తుండటంతో గందరగోళానికి దారి తీస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024 యాసంగి సీజన్‌లో రైతు భరోసా, 2025 యాసంగి సీజన్‌లో సన్నాలపై బోనస్ డబ్బులను ఎగ్గొట్టిందని రైతులు విమర్శిస్తున్నారు. పాత బకాయిలను చెల్లించకుండా రైతుల దృష్టిని మళ్లించేందుకు ఈసారి ప్రతి రైతుకూ పూర్తిస్థాయిలో ధాన్యం విక్రయ డబ్బులతో పాటు బోనస్ డబ్బులు అందిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పిస్తున్నారన్న ఆరోపించారు.
● గత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులు విక్రయించిన 1,03,706 క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.51.85 కోట్లు ప్రభుత్వం బోనస్ రూపంలో చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన కేవలం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. దాని గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఈ వానాకాలం సీజన్‌లో వరి ధాన్యం విక్రయాలు జరుపుతున్న రైతుల ఖాతాల్లోకి బోనస్ డబ్బులు జమ చేసింది. దీంతో గత యాసంగి సీజన్‌కు సంబంధించి బోనస్‌పై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.


