
నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకకుండా, అలాగే వీధి కుక్కల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల నుంచి అద్దె బకాయిలను వసూలు చేయాలన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన మహాకేఫ్‌లో ఆహార పదార్థాలను తయారీ చేసి అమ్ముకోవడానికి శిక్షణ పొందిన ఎస్‌హెచ్‌జీ మహిళలు ముందుకు రావాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్న, ఏసీపీ జ్యోత్సా ్నదేవి, ఇన్‌చార్జ్ ఎంఈ నర్సింహ, డీఈఈ హేమలత, ఏఈలు వైష్ణవి, వసంత, నుస్రత్, రాగవనిత, ఆర్‌ఓ–2 యాదయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు లక్ష్మయ్య, శ్రీనివాస్‌జీ, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.