
అన్నదాతల అరిగోస
రెండు బస్తాల యూరియా కోసం గంటల తరబడి నిరీక్షణ
● మళ్లీ రోడ్డెక్కి ఆందోళనకు దిగిన రైతులు
● ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద
తగ్గని బారులు
జడ్చర్ల/మహమ్మదాబాద్/మిడ్జిల్/చిన్నచింతకుంట/నవాబుపేట/రాజాపూర్/భూత్పూర్: రెండు బస్తాల యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. భార్యాపిల్లలు, పంట పొలాలను వదిలి ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అరకొరగా పంపిణీ చేయడం.. మరికొన్ని చోట్ల మొత్తానికే స్టాక్ లేదని చెబుతుండటంతో అసహనానికి గురవుతున్నారు. బుధవారం జడ్చర్ల సిగ్నల్‌గడ్డలో ఉన్న ఆగ్రో రైతు సేవాకేంద్రానికి వేకువజామునే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తీరా అక్కడ స్టాక్ లేదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. సమీపంలోని 167వ నంబర్ జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన వ్యక్తంచేశారు. యూరియా అందించి తమ పంటలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
● మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజులుగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుండగా.. అధికారులు, ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు స్టాక్ లేదని చెబుతుండటంతో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అరగంటకు పైగా నిర్వహించిన ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
● మిడ్జిల్ మండలంలోని రాణిపేటకు, మిడ్జిల్ ఆగ్రోస్, సింగిల్‌విండో కార్యాలయాలకు నాలుగు లారీల యూరియా వచ్చింది. రైతులు వేకువజామునే అక్కడికి చేరుకొని క్యూ కట్టారు. చివరకు చాలా మంది రైతులకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
● చిన్నచింతకుంట మండలం లాల్‌కోట పీఏసీఎస్ వద్ద రైతులు చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షించారు. మొత్తం 300 బస్తాల యూరియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
● నవాబుపేటలో పోలీసులు భారికేడ్లు ఏర్పాటుచేసి యూరియా పంపిణీ చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు వందలాదిగా తరలిరాగా.. పోలీసులు మహిళలు, పురుషులను వేర్వేరు లైన్‌లలో నిలబెట్టారు.
● రాజాపూర్ మండలకేంద్రంతో పాటు తిర్మలాపూర్ ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. లైన్‌లో ఉన్న చాలా మందికి యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
● భూత్పూర్‌లోని ఆగ్రో రైతు సేవాకేంద్రం, సింగిల్‌విండోల వద్ద ఉదయం 6 గంటల నుంచే రైతులు బారులు తీరారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు.

అన్నదాతల అరిగోస