
ఎడ్యుకేషన్.. ఇరిగేషన్
నియోజకవర్గానికో ఏటీసీ..
ఇవే పాలమూరు తలరాతను మారుస్తాయి
● ఏ అవకాశం వచ్చినా మొదటి ముద్ద పాలమూరుకే..
● ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా..
● అప్పుడే వలసలు ఆగుతాయి..
● ఎస్‌జీడీ ఫార్మా 2వ యూనిట్
ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
● ‘కొడంగల్’ భూనిర్వాసిత రైతులకు న్యాయం చేస్తాం
●
పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి నాటి పాలకులు ప్రపంచ నాయకులను
పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవారు. భవిష్యత్‌లో మన అభివృద్ధి, పరిశ్రమలు, యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్ట్‌లను సందర్శించేలా అభివృద్ధి చేసుకోవాలి. వీటిని చూసేందుకు
దేశ, విదేశాల నుంచి పర్యాటకులు రావాలి. పరిశ్రమలు కావాలంటే భూములు కావాలి.
ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి వివరాలను అధికారులు నాకు పంపాలి. ఏ పరిశ్రమ వచ్చినా మొదటగా పాలమూరుకు పంపుతాను. నాకు ఏ అవకాశం వచ్చినా మొదటి
ముద్ద పాలమూరు ప్రజలకు పెడుతా. మంత్రి వర్గంలోని మంత్రులు ఏమనుకున్నా మంచిదే.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారుపేరు. ఈ దేశంలో భాక్రానంగల్, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ.. ఇలా ఏ మూలన ప్రాజెక్ట్‌లు కట్టినా తట్ట పని, మట్టి పని చేయాలంటే పాలమూరు బిడ్డలే కావాలి. వారి భాగస్వామ్యం లేకుంటే ఏ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీనికి ప్రధానం కారణం చదువులో వెనకబాటు, సాగు నీరు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాల్లోని పెద్దలు ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ వలసలు ఆగలేదు. అందుకే పాలమూరు బిడ్డగా నా బాధ్యత నెరవేరుస్తా. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ లక్ష్యంగా పాలమూరు జిల్లా ప్రజల తలరాతలు మార్చేందుకు కృషి చేస్తా.’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఫర్నేస్ లైటింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘పాలమూరు బిడ్డల చదువు కోసం ఏది కావాలన్నా.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు అందించి పూర్తి చేస్తాం. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లమవుతాం.’ అని పేర్కొన్నారు. ఇంకా రేవంత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్లీ 75 ఏళ్ల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. విద్య, ఇరిగేషన్, ఉపాధి రంగాల్లో సరైన ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వాతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ.200 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అంతేకాకుండా ఉమ్మడి పాలమూరులో 14 అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఆ సెంటర్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. పాలమూరు బిడ్డలు వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గం. పాలమూరు జిల్లా నుంచి ఇంజినీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఎదగాలి. నూతన పరిశ్రమలకు వేదిక మహబూబ్‌నగర్ కాబోతోంది.