
వైకుంఠవాసుడికి ఏరువాడ జోడు పంచెలు
● 41 రోజులుగా నిష్టతో పంచెలు నేసిన కార్మికులు
● గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచే కొనసాగుతున్న ఆనవాయితీ
● రేపు టీటీడీ అధికారులకు అందజేత
ప్రత్యేకంగా నామాల మగ్గాలపై
ఏరువాడ జోడు పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారీకి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను స్థానిక లింగంబాగ్ కాలనీలోని మహంకాళీ కర్ణాకర్ నివాసంలో ప్రత్యేకంగా నిర్మించిన నామాల మగ్గంపై నలుగురు నేత కార్మికులు ప్రత్యేక నిష్ట, భక్తి శ్రద్ధలను పాటిస్తూ సిద్ధం చేశారు. పంచెల తయారీలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, మ్యాడం రమేష్ పాల్గొన్నారు.
గద్వాలటౌన్: గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ఇటీవల పూర్తయింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబరు 2 వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాదీశుల్లో ఒకరైనా రాజవంశీయులు రాజా కృష్ణరాంభూపాల్, పంచెల తయారీదారుడు మహంకాళీ కర్ణాకర్ తిరుపతికి చేరుకున్నారు. ఈ నెల 28న జోడు పంచెలను టీటీడీ అధికారులకు అందజేయనున్నారు.
అదృష్టంగా భావిస్తున్నా
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాదీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. మా వంశీయులు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నాం. ఈ ఏడాది నా చేతుల మీదుగా స్వామికి జోడు పంచెలను అందించడం అదృష్టంగా భావిస్తున్నా. – రాజా కృష్ణరాంభూపాల్,
గద్వాల రాజ వంశీయులు

వైకుంఠవాసుడికి ఏరువాడ జోడు పంచెలు

వైకుంఠవాసుడికి ఏరువాడ జోడు పంచెలు