
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
జడ్చర్ల: రైతుల సమస్యలు పట్టించుకోకుండా ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమవుతోందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ఈర్లపల్లి తండాకు చెందిన రైతు విస్లావత్ రవి నాయక్(42) అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం రైతు రవి మృతదేహాన్ని ఇంటికి తరలిస్తూ మార్గమధ్యలో ముదిరెడ్డిపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై రైతు కుటుంబానికి మద్దతుగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదలేసిందని, రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు అందించలేని దుస్థితిలో సర్కార్ కొనసాగుతుందన్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా రెఫర్ చేసి చేతులు దులిపేసి ప్రాణాలు తీస్తున్నారని ఇలాంటి కోవలోనే రైతు రవినాయక్ ప్రాణాలు కోల్పోయాడని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. జడ్చర్ల వంద పడకల ఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించాలని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినా స్పందన లేదన్నారు. సరైన వైద్యం అందించలేని వైద్యసిబ్బందిపై చర్యలు చేపట్టాలని, రైతు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు కొండల్, శ్రీకాంత్, శ్రీశైలం, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
సకాలంలో వైద్యం అందిచలేని అసమర్థ పాలన
మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ధ్వజం
రైతు మృతదేహంతో జాతీయ రహదారిపై ఆందోళన