
సైనిక సంక్షేమంపై న్యాయసేవలు విస్తృతం చేయాలి
● హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
● జిల్లా కోర్టులో సైనిక లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
పాలమూరు: సైనికుల సంక్షేమంపై న్యాయసేవలను విస్తృతం చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్‌కుమార్ సింగ్ సూచించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్యామ్‌కొసి, కార్యదర్శి పంచాక్షరిలతో కలిసి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్‌కుమార్ సింగ్ జిల్లాకేంద్రంలోని సైనిక వెల్ఫేర్ జిల్లా కార్యాలయంలో మంగళవారం లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఆనంతరం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి మాట్లాడుతూ మాజీ సైనికులు, వితంతువులు, సర్వీస్‌లో ఉన్న త్రివిధ దళాల సిబ్బంది, అధికారులకు వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎదురవుతున్న న్యాయ సమస్యలపై న్యాయపరమైన సలహాలు, సూచనలు అందించడానికి రాష్ట్రంలో 8 చోట్ల ఈ కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. సైనికుల కుటుంబాల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ, ఇంటి పన్ను మినహాయింపు, ప్రభుత్వం ఇచ్చిన భూములు, ప్లాట్స్ వద్ద ఎదురవుతున్న సమస్యలపై లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా న్యాయ సహాయం పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, సర్వీస్‌లో ఉన్న త్రివిధ దళాల సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.