
రైతు వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రైతు వ్యతిరేక ప్రభుత్వాల మెడలు వంచాలని హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. దేశం, రాష్ట్రంలో రాజకీయాలు దిగజారిపోయాయన్నారు. రాజకీయాలు మతాలు, ఆవులు, డబ్బుల చుట్టూ తిరుగుతున్నాయని మండిపడ్డారు. నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా నిల్చోబెట్టగా నక్సలైట్ సానుభూతిపరుడని కేంద్ర మంత్రి అమిత్‌షా మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగం, కోర్టులపై అవగాహనలేని వ్యక్తులు సంకుచిత ధోరణితో ఆలోచిస్తారన్నారు. న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకివ్వరని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు రాజ్యాం స్థాపన కోసం కృషి చేయాలన్నారు. సీపీఐ మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి రాంచందర్ మాట్లాడుతూ.. రైతులు సంఘంటితంగా లేనందుకే ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు మోసం చేస్తున్నారన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వాలు పని చేస్తున్నాయని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి ఆరోపించారు. రాబోయే రోజుల్లో పోరాటాలు నిర్వహించేందుకు కార్యోన్ముకులు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఈకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి పద్మ, రామకృష్ణ, జయ తదితరులు పాల్గొన్నారు.