రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Aug 27 2025 10:01 AM | Updated on Aug 27 2025 10:01 AM

రోడ్డు ప్రమాదంలో  వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వెల్దండ: మండల పరిధిలోని పెద్దాపూర్‌ సమీపంలో హైదరాబాదద్‌–శ్రీశైలం జాతీయ రహదారిపై మంగళవారం కుప్పగండ్ల గ్రామానికి చెందిన అయిల జంగయ్య(60) అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. జంగయ్య గ్రామంలో కిరాణ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం షాపులోకి సామగ్రి తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై వెల్దండకు బయలుదేరాడు. మార్గమధ్యలో పెద్దాపూర్‌ బస్‌స్టేజి సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జంగయ్యకు తీవ్ర గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జంగయ్యను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.

1000 లీటర్ల డీజిల్‌

అపహరణ

లారీల ట్యాంకుల నుంచి మాయం

చారకొండ: ప్రధాన రహదారి పక్కన ఆపిన లారీల నుంచి దాదాపుగా 1000 లీటర్ల డీజిల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. దీంతో లారీలు అక్కడికి అక్కడే ఆగిపోయాయి. లారీ డ్రైవర్లు తెలిపిన వివరాలు.. సూర్యాపేట్‌ నుంచి రాయచూర్‌కు వరిధాన్యం లోడుతో వెళ్తున్న 3 లారీలు మండల కేంద్రం సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద ఆపి సోమవారం రాత్రి పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి డీజిల్‌ ట్యాంకులకు మూతలు తెరచి ఉండటంతో పరిశీలించగా ట్యాంకులు ఖాళీగా కనిపించాయి. మూడు లారీలో రూ.95 వేల విలువ గల డీజిల్‌ అపహరించడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు డ్రైవర్లు తెలిపారు.

అంతర్రాష్ట్ర దొంగకు రిమాండ్‌

మక్తల్‌: అంతర్రాష్ట్ర దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మక్తల్‌ సీఐ రాంరాల్‌, మక్తల్‌ ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డిలు మంగళవారం విలేకర్లకు తెలిపారు. నిందితుడు జూలై 11న మక్తల్‌ టీచర్స్‌ కాలనీలో భూత్పుర్‌ పవన్‌కుమార్‌ ఇంట్లో అర్ధరాత్రి చొరబడి తాళం విరగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, రూ.30 వేలు చోరీ చేశాడు. జనవరి 22న మక్తల్‌ యల్లమ్మకుంటలో అనిత ఇంటి తాళం విరగొట్టి బంగారం, వెండి వస్తువులు రూ.52 వేల నగదు దొంగిలించాడు. రెండు చోట్ల ఆంధ్రప్రదేశ్‌ అనంతపూర్‌ జిల్లా కల్యాణదుర్గం మండలం తూర్పుకోడుపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి ప్రశాంత్‌కుమార్‌ ఆలియాస్‌ శ్రీనివాస్‌ చోరీకి పాల్పడ్డాడు. తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేసి దొంగతనానికి పాల్పడుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో వివిధ పోలీస్‌స్టేషన్లలో అతనిపై దాదాపు 30 నుంచి 40 కేసులు నమోదయ్యాయి. ఎరుకలి ప్రశాంత్‌కుమార్‌ మక్తల్‌లో బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మక్తల్‌ పోలీసులు పట్టుకోని విచారించారు. మేసీ్త్ర పనికి వెళ్తూ జీవనం గడుపుతున్నట్లు తెలిపాడు. కూలీ డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు 13 కేసులు మహబూబ్‌నగర్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడితో రూ.5.27లక్షలు, వస్తువులు రికవరీ చేసి కేసు నమోదు చేశారు. మక్తల్‌ ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, మక్తల్‌ ఏఎస్‌ఐ శంకరయ్య, సిబ్బంది అశోక్‌, నరేష్‌, శ్రీకాంత్‌లను సీఐ అభినందించారు. మంగళవారం మక్తల్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మక్తల్‌ సీఐ రాంలాల్‌ తెలిపారు.

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి: సీఐటీయూ

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: దివిటిపల్లి ఐటీ పార్కులోని అమరరాజా గిగా ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి కోరారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి సర్వే చేయగా ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం అందులో బ్యాటరీల ప్యాకింగ్‌ నడుస్తోందని, సుమారు 500 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. మస్టర్‌, నాన్‌ మస్టర్‌, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌, స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ తదితర పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన వారినే ఎక్కువగా యాజమాన్యం నియమించుకుందని ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పేరుతో 94 రోజుల పాటు ఇక్కడ శిక్షణ ఇస్తున్నా.. మళ్లీ శిక్షణ కోసమంటూ ఏకంగా బెంగళూరు, చైన్నె, తిరుపతి, విశాఖపట్టణం, హైదరాబాద్‌కు కార్మికులను తీసుకెళుతున్నారన్నారు. ముఖ్యంగా 18–30 ఏళ్లలోపు వారికే ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. అతి తక్కువ వేతనాలు (రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు) మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆల్ట్‌మెన్‌, లోహం ఎనర్జీ పరిశ్రమలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేసి మహబూబ్‌ నగర్‌, ఎదిర, ఏనుగొండ, దివిటిపల్లి, సిద్దాయపల్లి, అమిస్తాపూర్‌కు చెందిన యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ అంశాలపైనే ఈనెల 29న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement