
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
● మక్తల్ మండలం దాసర్‌పల్లికి చెందిన కృష్ణవేణి అలియాస్ కిష్టమ్మ (30) కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ మక్తల్ మండలం సంగంబండ సమీపంలోని ఆశ్రమంలో ఉండేది. ఆదివారం ఆశ్రమం నుంచి సంగంబండ గ్రామం వైపు ఆమె నడుచుకుంటూ వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
● మహారాష్ట్ర నుంచి ఉలిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజీ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్ సంతోష్ (38) మృతిచెందాడు. మరో డ్రైవర్ వీరకుమార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి సోదరుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మల్లేష్ తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మక్తల్ మండలం సంగంబండ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న యువతిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అటుగా వెళ్తున్న రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి గమనించి.. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాన్ని మక్తల్ మార్చురీకి తరలించి మానవత్వం చాటుకున్నారు. కల్వకుర్తి పట్టణంలో లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజీ సమీపంలో లారీ బోల్తాపడి డ్రైవర్ దుర్మరణం చెందాడు. – మక్తల్/కల్వకుర్తి టౌన్/గట్టు/వెల్దండ
లారీ, బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మాధవరెడ్డి వివరాల మేరకు.. తాండ్రకు చెందిన శ్రీను (45) వ్యక్తిగత పనుల నిమిత్తం స్వగ్రామం నుంచి కల్వకుర్తికి బైకుపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని సీబీఎం కళాశాల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బాబాయ్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం