డిప్యూటీ తహసీల్దార్ల బదిలీలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు కొందరు బదిలీ అయ్యారు. వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న స్వప్న, జోగుళాంబ గద్వాల జిల్లాలో పనిచేస్తున్న ఆంజనేయులును మహబూబ్‌నగర్ జిల్లాకు కేటాయించారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ అయిన వారికి స్థానాలను కేటాయించనున్నారు.
రైలు ఢీకొని వేర్వేరు ప్రాంతాల్లో
ఇద్దరి దుర్మరణం
మహబూబ్‌నగర్ క్రైం/దేవరకద్ర: వేర్వేరు ప్రాంతాల్లో పట్టాలు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను రైళ్లు ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రైల్వే ఎస్‌ఐ కె.రాజు వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో శనివారం గుర్తుతెలియని వ్యక్తి (60) రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదని.. మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
● దేవరకద్రలో మూతపడిన రైల్వేగేటు సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే ఎస్‌ఐ అక్బర్ వివరాల మేరకు.. దేవరకద్ర మండలం పెద్దరాజమూర్‌కు చెందిన బాజాపల్లి ఆంజనేయులు (52) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకునే వాడు. ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చిన అతడు.. దేవరకద్రలోని అత్తగారింటికి వెళ్లడానికి రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
ఫిల్టర్ ఇసుక కేంద్రాలు ధ్వంసం
బిజినేపల్లి: మండలంలోని లట్టుపల్లి గ్రామ శివారు తండాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన 4 ఫిల్టర్ ఇసుక కేంద్రాలను తహసీల్దార్ శ్రీరాములు, ఎస్‌ఐ శ్రీనివాసులు ధ్వంసం చేశారు. శనివారం ప్రత్యేకంగా ఫిల్టర్ ఇసుక కేంద్రాలపై రైడ్ నిర్వహించారు. మిట్యా తండాతో పాటు ఇతర తండా పరిసరాల్లో అక్రమంగా డంప్ చేసిన ఫిల్టర్ ఇసుకను ధ్వంసం చేసి 8 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇళ్లు, భవనాల నిర్మాణం కోసం ఫిల్టర్ ఇసుకను వాడరాదని, నాణ్యమైన ఇసుకను వినియోగించాలన్నారు. ఇసుక అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిల్టర్ ఇసుకలు నిర్వహించే వారి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు.


