రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ టూడే లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఎండీసీఏ ఆధ్వర్యంలో వేసవిలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అయితే ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లకు శ్రీకారం చుట్టారు. ఈ లీగ్‌లకు సంబంధించి ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్–19, 23 విభాగాల జిల్లాల జట్ల ఎంపికలు నిర్వహించగా.. వందలాది విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
పాల్గొననున్న ఆరు జట్లు..
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఈ నెల 19 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ పురుషుల అండర్–23 క్రికెట్ టూడే లీగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎండీసీఏ ఆధ్వర్యంలో లీగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను రెండు పూల్‌లుగా విభజించారు. పూల్–ఏలో మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, పూల్–బీలో జడ్చర్ల, గద్వాల, నాగర్‌కర్నూల్ జట్లు ఉన్నాయి. ఐదు రౌండ్లలో టూడే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
క్రీడాకారులు ప్రతిభ చాటాలి..
ఇంట్రా డిస్ట్రిక్ట్ అండర్–23 లీగ్‌లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్‌లు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులకు ఈ లీగ్ ఒక వరంలా మారనుంది. ఈ లీగ్‌లో రాణించే క్రీడాకారులను రానున్న హెచ్‌సీఏ లీగ్‌ల్లో పాల్గొనే ఎండీసీఏ జట్లకు ఎంపిక చేస్తాం.
మ్యాచ్‌ల వివరాలు..
వచ్చేనెల 1వ తేదీ వరకు కొనసాగనున్న
అండర్–23 క్రికెట్ మ్యాచ్‌లు
ఉమ్మడి జిల్లాలోని
ఆరు వేదికల్లో నిర్వహణ
ఉమ్మడి జిల్లాలోని ఆరు వేదికల్లో మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. మొదటి రౌండ్ ఈ నెల 19, 20 తేదీల్లో నాగర్‌కర్నూల్–వనపర్తి (వేదిక–నాగర్‌కర్నూల్), జడ్చర్ల–మహబూబ్‌నగర్ (జడ్చర్ల), గద్వాల–నారాయణపేట (నారాయణపేట), రెండో రౌండ్ 22, 23 తేదీల్లో మహబూబ్‌నగర్–గద్వాల (మహబూబ్‌నగర్), వనపర్తి–నారాయణపేట (వనపర్తి), జడ్చర్ల–నాగర్‌కర్నూల్ (జడ్చర్ల), మూడో రౌండ్ 25, 26 తేదీల్లో నారాయణపేట–జడ్చర్ల (నారాయణపేట), మహబూబ్‌నగర్–నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్), వనపర్తి–గద్వాల (గద్వాల), నాలుగో రౌండ్ 28, 29 తేదీల్లో మహబూబ్‌నగర్–వనపర్తి (మహబూబ్‌నగర్), జడ్చర్ల–గద్వాల (జడ్చర్ల), నారాయణపేట–నాగర్‌కర్నూల్ (నాగర్‌కర్నూల్), ఐదో రౌడ్ 31, జూన్ 1 తేదీల్లో మహబూబ్‌నగర్–నారాయణపేట (నాగర్‌కర్నూల్), గద్వాల–నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్), జడ్చర్ల–వనపర్తి (గద్వాల).


