చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
జడ్చర్ల: మండలంలోని వల్లూరుకు చెందిన మొండి ఎల్లప్ప (42) చేపల వేటకు వెళ్లి మృతిచెందాడని సీఐ కమలాకర్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఎల్లప్ప సోమవారం ఉదండాపూర్ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వేసిన వల కాళ్లకు చుట్టుకొని మునిగిపోయాడు. మంగళవారం నీటిపై మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గుర్తించి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
‘సమస్య
పరిష్కరించకుంటే.. చావే’
నవాబుపేట: ‘తమ భూమి ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మునుగుతుందని అధికారులు సర్వే చేసి భూమిని తీసుకున్నారు. తీరా కట్ట పనులు సాగుతుండగా.. మా భూమి ప్రాజెక్టులో మునగడం లేదు. దీంతో ఈ విషయాన్ని సర్వే ద్వారా రుజువు చూయించి.. భూమిని సాగు చేసుకునేలా అవకాశం ఇవ్వాలని, లేకపోతే 24 గంటల్లో ఆత్మహత్య చేసుకుంటానని’ ఓ రైతు వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కారుకొండ గ్రామ రైతు నర్సింహులుకు సర్వే నం.116(బీ)లో 3.32 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఉదండాపూర్ రిజర్వాయర్‌లో మునుగుతుందని చెప్పి పరిహారం సైతం ఇచ్చారు. అయితే కట్ట నిర్మాణం సాగుతుండగా.. నర్సింహులు భూమి ప్రాజెక్టు పరిధిలోకి రాకపోవడంతో నాటి నుంచి బీడుగా మారింది. దీంతో తమ భూమి ప్రాజెక్టులో మునగడం లేదని, ఈ భూమిని తమకు తిరిగి ఇవ్వాలని రైతు కోరుతున్నాడు. ఈ విషయమై అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మంగళవారం తనకు న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు అతనికి సర్దిచెప్పి ఎమ్మెల్యేతో మాట్లాడించి సమ్యను పరిష్కరించేలా చేస్తానని హామీ ఇప్పించారు.
పీయూలో అధ్యాపకుల వంటావార్పు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్టు అధ్యాపకులు 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మంగళవారం పీయూ ముఖద్వారం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు శేకుంటి రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా యూనివర్సిటీలో పని చేస్తున్న అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలని, ప్రారంభం నుంచి యూనివర్సిటీనే నమ్ముకునే విధులు నిర్వహిస్తున్నామన్నారు. రీసెర్చ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సెమినార్‌లో కన్వీనర్లుగా వ్యవహరించిన అనుభవం ఉందన్నారు. ఉద్యోగాల్లో ఎలాంటి భద్రతా భావం లేకుండా జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సురేష్, ప్రదీప్, /్ఞానేశ్వర్, కిషోర్, గౌస్, సోమేష్, శ్రీనివాసులు, విజయ్‌భాస్కర్, గురుస్వామి, స్వాతి, సుస్మిత పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి


