అమరచింత: జల్సా చేస్తూ.. మద్యానికి బానిసైన చింతరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యాపలబావి సురేష్ తన పొలంలో ఆపిన గొర్రెలను దొంగిలించాడని సీఐ శివకుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ విలేకరులకు వెల్లడించారు. నారాయణపేట జిల్లా యల్లంపల్లి గ్రామానికి చెందిన కుర్వ నాగరాజు తన గొర్రెల మందతో అమరచింత మండలంలోని చింతరెడ్డిపల్లి గ్రామ శివారులో ఈ నెల 22న రాత్రి గొర్రెల మంద యాపలబావి సురేష్ వ్యవసాయ పొలంలో ఆపాడు. మరుసటి రోజు గొర్రెల మంద వద్దకు వెళ్లి చూడగా కొన్ని గొర్రె పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పొలం యాజమాని సురేష్‌ను అడగగా తడబడుతూ సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారించగా సురేష్ తనతోపాటు మిట్టనందిమళ్లకు చెందిన కుర్వ గోవిందు, కుర్వ మల్లేష్, చింతరెడ్డిపల్లికి చెందిన సుధాకర్‌తో కలిసి 13 గొర్రెలను దొంగిలించి వాటిని టాటా ఏస్ వాహనంలో కోస్గి సంతకు తీసుకెళ్లి విక్రయించినట్లు అంగీకరించారు. ఈ మేరకు రూ.90 వేలు రాగా.. సురేష్ రూ.30 వేలు తీసుకోగా సహకరించిన మిగతా ముగ్గురు రూ.20 వేల చొప్పున తీసుకున్నట్లు చెప్పారు. దీంతో నిందితుల నుంచి డబ్బులతోపాటు టాటా ఏస్ వాహనం స్వాధీనం చేసుకుని చోరీకి పాల్పడిన వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.