
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): శాసనసభ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేందుకు కేంద్రాలను గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నవాటిని ఎంపిక చేశారు. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలను పరిశీలించి నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూంలలో ఉంచారు. అవి భద్రపరిచిన చోటే సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండటంతో సిబ్బంది 29న ఉదయం 7 గంటల వరకు కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లతో పాటు పోలింగ్ అవసరమైన ఇతర సామగ్రితో సిబ్బంది అదే రోజు మధ్యాహ్నం కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం నాటికి వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే పలు దశల్లో శిక్షణ ఇచ్చారు.
జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు..
డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాన్ని గుర్తించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు మహబూబ్‌నగర్ మండలంలోని ధర్మాపూర్ పంచాయతీ పరిధిలోని జయప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజవర్గాల నుంచి ఈవీఎంలు భారీ బందోబస్తు మధ్య ఇక్కడి స్ట్రాంగ్ రూంకు తరలిస్తారు. గత ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇక్కడే నిర్వహించారు.
పోలింగ్ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు..
మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బాలుర జూనియర్ కళాశాల, దేవరకద్రకు జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో, జడ్చర్ల నియోజకవర్గానికి జడ్చర్లలోని బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల కేటాయించారు.
ఏర్పాట్లు చేశాం..
ఈ నెల 30వ తేదీన పోలింగ్‌కు సంబంధించి సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. మహబూబ్‌నగర్‌కు సంబంధించిన కేంద్రాన్ని బాలుర ప్రభుత్వం జూనియర్ కళాశాల కేటాయించాం. – అనిల్‌కుమార్,
మహబూబ్‌నగ్ రిటర్నింగ్ అఽధికారి, ఆర్డీఓ
జేపీఎన్‌సీలో ఓట్ల లెక్కింపు