మరికల్: చిరుత దాడిలో లేగదూడ హతమైన ఘటన మరికల్ మండలం పూసల్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పూసల్‌పహాడ్‌కు చెందిన రైతు పాలెం రఘు బుధవారం రాత్రి వ్యవసాయ పొలంలోనే పశువులను కట్టేసి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో పశువుల పాకపై చిరుత దాడిచేసి లేగదూడను హతమార్చింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు గురువారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా మండలంలోని రాకొండ శివారులో ఇటీవల అటవీశాఖ అధికారులకు చిరుత చిక్కిన ఘటనను మర్చిపోకముందే.. సమీపంలోని పూసల్‌పహాడ్‌లో మరో చిరుత దూడపై దాడి చేయడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతల బారి నుంచి మూగజీవాలను కాపాడాలని కోరుతున్నారు. పూసల్‌పహాడ్‌లో పాల్లెం రఘుకు చెందిన మూడు దూడలు చిరుత దాడిలోనే మృతి చెందాయని, బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.