
జడ్చర్ల చంద్రగార్డెన్ ఎదురుగా బాణాసంచా విక్రయాల కోసం ఏర్పాటు చేస్తున్న దుకాణాలు
మహబూబ్‌నగర్ క్రైం/జడ్చర్లటౌన్ : దీపావళి అంటే ముందుగా గుర్తొచ్చేది బాణాసంచా. చిన్నా పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరు టపాసులు కాల్చి ఆనందంగా పండుగ చేసుకుంటారు. దీంతో టపాసులకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీపావళి పండగ వస్తుందంటే వారం రోజుల ముందే పట్టణ ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు వెలుస్తాయి. ఈ ఏడాది కూడా మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 70 దుకాణాల ఏర్పాటుకుగాను వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా జడ్చర్లలో 9 దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. తాత్కాలిక దుకాణాలు నడుపుకోవడానికి నిర్వాహకులకు రెండు వారాల పాటు టపాసులు విక్రయించేందుకు లైసెన్స్ ఇస్తారు. అదేవిధంగా హోల్‌సెల్ దుకాణాదారులకు లైసెన్స్ 30రోజుల పాటు ఉంటుంది.
అనుమతించిన స్థలంలోనే విక్రయాలు..
జడ్చర్ల పట్టణంలోని చంద్రగార్డెన్ ఎదురుగా బాణాసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసు, అటవీ, మున్సిపల్ శాఖలు అనుమతి ఇచ్చారు. ప్రతిఏటా ఇక్కడే తాత్కాలికంగా దుకాణాలను ఏర్పాటు చేసి బాణాసంచా విక్రయాలు చేపడుతున్నారు. దుకాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
● అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం జనవాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు, దుకాణాలు ఉండరాదు. గోదాములు సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు.
● నివాస సముదాయాలకు కనీసం 50మీటర్ల దూరంలో దుకాణాలు ఉండాలి.
● తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు సైతం 10మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది.
● ప్రతి దుకాణం వద్ద ప్రత్యేకంగా నీటి సౌలభ్యం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేయాలి.
● జనావాసాల మధ్య తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసే చోట తప్పనిసరిగా అగ్నిమాపకశాఖ ఎన్‌వోసీ ఉండి తీరాలి. ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ధూమపానం నిషేధిత స్థలంగా ప్రకటించాలి.
● ప్రత్యేకంగా తయారు చేసిన జింక్, జీఐ రేకులతో మాత్రమే దుకాణ షెడ్డులను ఏర్పాటు చేయాలి.
● ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడికి అగ్నిమాపక వాహనం వచ్చి చుట్టూ తిరిగే విధంగా స్థలం ఉంచి షెడ్డు నిర్మించుకోవాలి.
● దుకాణాల మధ్య తప్పనిసరిగా 3మీటర్ల దూరం ఉండాలి. వాటితో పాటు బాణాసంచా కొనుగోలు చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా దారులను ఏర్పాటు చేయాలి.
● విద్యుత్ వైరింగ్‌కు ఎలాంటి అతుకులు లేని వైర్‌ను ఉపయోగించాలి. ఒక్కో సందర్భంలో వీటి నుంచి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది.
● రేకులతో కూడిన షెడ్డు నిర్మిస్తేనే అనుమతి ఉంటుంది.
● ప్రతి దుకాణాంలో రెండు మంటలను ఆర్పే పరికరాలు, 200 లీటర్ల సామర్థ్యంగల రెండు డ్రమ్ములు, 4 బకెట్‌లు, రెండు ఇసుక బకెట్‌లను అందుబాటులో ఉంచుకోవాలి.
● బాణాసంచా దుకాణాల సమీపంలో ఎట్టి పరిస్థితిలో పొగ తాగరాదని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలి.
● దుకాణాలకు దూరంగా వాహనాలను పార్కింగ్ చేసే విధంగా చూడాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
పిల్లలను ఒంటరిగా బాణాసంచా కాల్చనివ్వొద్దు. పెద్దవాళ్ల పర్యవేక్షణలో వారు పండుగ జరుపుకొనేలా చూసుకోవాలి.
చిన్నారుల నుంచి పెద్దల వరకు కాటన్ దుస్తులు, కళ్లజోడు ధరించడంతో పాటు చెవుల్లో దూది, ప్రథమ చికిత్స బాక్స్, నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి.
ఇంటి తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి.
ఐఎస్‌ఐ మార్క్ ఉన్న టపాసులను కొనుగోలు చేయాలి.
పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏరియాలు, కారిడార్‌లలో, బిజీగా ఉండే రోడ్లపై, వాహనాల పక్కన బాణాసంచా కాల్చరాదు.
నిప్పంటించినా పేలని వాటి దగ్గరగా వెళ్లి పరిశీలించవద్దు.
నోటితో ఊదడం, చేతితో సరిచేయడం వల్ల అకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉంటుంది.
ఐఎస్‌ఐ మార్క్‌గల
టపాసులనే కొనుగోలు చేయండి
కాటన్ దుస్తులు, కళ్లజోడు ధరించాలి
జిల్లాలో టపాసుల విక్రయాలకు సిద్ధం
తాత్కాలిక దుకాణాల
ఏర్పాటుకు దరఖాస్తులు
మహబూబ్‌నగర్‌లో 70, జడ్చర్లలో 9 దుకాణాల ఏర్పాటు