● ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ఎంపిక
● మహబూబ్‌నగర్ నుంచి అధికంగా 180 మంది
● కొనసాగుతున్న హజ్ యాత్రికుల శిక్షణ శిబిరాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్రకు ప్రాముఖ్యత పెరగడంతో ధనికుల నుంచి పేదవారు కూడా హజ్ యాత్రకు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒక్క సారైనా హజ్ యాత్ర చేయాలని పవిత్ర ఖురాన్‌లో పేర్కొనబడినందున గ్రామీణ ప్రాంతాలకు చెందిన ముస్లింలలో సైతం హజ్‌యాత్ర చేయాలనే ఆకాంక్ష పెరుగుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కూడా హజ్‌యాత్ర చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఉమ్మడి జిల్లా నుంచి
251 మంది ప్రయాణం..
ఈ ఏడాది ఉమ్మడి జిల్లా నుంచి 251 మంది ముస్లింలు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్‌యాత్రకు వెళ్తున్నారు. వీరిలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అధికంగా 180 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. అదే విధంగా వనపర్తి నుంచి 35, నాగర్‌కర్నూల్ నుంచి 9, నారాయణపేట నుంచి 10, గద్వాల నుంచి 17 మంది హజ్‌కు యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మరి కొంతమంది హజ్‌కు వెళ్లే అవకాశం ఉంది.
యాత్రికులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు...
ఇస్లామిక్ సంవత్సరంలోని ‘జిల్‌హజ్జా’ మాసంలో మక్కా, మదీనా తదితర పుణ్యక్షేత్రాల్లో పాటించాల్సిన నియమాలు, నిబంధనల పట్ల హజ్ యాత్రికులకు అవగాహన కల్పించడానికి జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. మతపెద్దలను ఆహ్వానించి హజ్ యాత్రలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, ప్రసిద్ద స్థలాల ప్రాశస్త్యాలను వివరించి అవగాహన కల్పిస్తారు.
కొనసాగుతున్న శిక్షణా శిబిరాలు
ప్రస్తుతం జిల్లాలో హజ్‌యాత్రీకుల శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. మతపెద్దలతో హజ్‌యాత్రపై యాత్రీకులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ విధానంలో హజ్ గురించి సమగ్రంగా వివరిస్తారు. అలాగే హజ్ యాత్రలో తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులతో అవగాహన కల్పిస్తారు. ఇప్పటి వరకు మూడు శిక్షణా శిబిరాలు పూర్తి కాగా మరో మూడు శిబిరాలతో పాటు చివరి శిబిరంలో టీకాల క్యాంపు ఏర్పాటు చేస్తారు.


