నాలుగేళ్లలో ప్రమాదాలు ఇలా..
● వేసవిలో తరచుగా కార్చిచ్చు
● అగ్నికి ఆహుతి అవుతున్న
అటవీ సంపద
● ప్రశ్నార్థకంగా మారుతున్న జీవవైవిధ్యం
● ఈ ఏడాది నెల రోజుల్లోనే
50 అగ్ని ప్రమాదాలు
అచ్చంపేట: ఆకులు రాలే కాలానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో నల్లమల అటవీ ప్రాంతం భగ్గుమంటోంది. నిత్యం ఏదో ఒకచోట కార్చిచ్చు రాజుకుంటోంది. వందలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్ని కీలగా మారుతోంది. ప్రతి ఏటా వేసవిలో ఈ తంతు పరిపాటిగా మారింది. 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నల్లమల అడవుల్లో గడ్డిక్షేత్రాలు విస్తారంగా ఉన్నాయి. దీంతో ఎక్కడ చిన్న అగ్గి రాజుకున్నా అడివంతా విస్తరిస్తోంది. వన్యప్రాణులతో పాటు వృక్ష సంపదకు తీవ్ర నష్టం కలుగుతోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 7.73 లక్షల ఎకరాల్లో అటవీ భూమి విస్తరించి ఉంది. ఇందులో కేవలం నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో నల్లమల ప్రాంతమే 6.17 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఏడాది నెలరోజుల వ్యవధిలోనే దోమలపెంట, అమ్రాబాద్, కొల్లాపూర్, లింగాల అటవీ పరిసరాల్లో మొదలైన కార్చిచ్చును ఆపడం సిబ్బందికి శక్తికి మించిన పనిగా మారింది. ఒకచోట మంటలను ఆర్పితే.. మరుసటి రోజు మరో చోట మంటలంటుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరిన్ని అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
నల్లమల అడవిలో ఎండిన గడ్డి, ఎండిన చెట్లు, వెదురు కర్రలు అధికంగా ఉంటాయి. అడవి జంతువులు పరుగెత్తే సమయంలో రాళ్లకు రాళ్లు తగిలి నిప్పురవ్వలు వచ్చి క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. అదే విధంగా నారవేప, దేవదారు, నల్లమద్ది వంటి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకడం వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉంది. కాగా, సహజ సిద్ధంగా ఏర్పడే మంటలను మినహాయిస్తే.. 70–80 శాతం అగ్ని ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారి వెంట దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. మన్ననూర్ నుంచి వట్టువర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగా, శ్రీశైలం వెళ్లే యాత్రికులు, పర్యాటకులు, ఇతరులు రోడ్డు పక్కన, అటవీ ప్రాంతంలో నిప్పు రగిల్చి సక్రమంగా ఆర్పకపోవడం.. సిగరెట్లు, బీడీలు తాగి పడే యడం వంటి వాటితో పాటు అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లినవారు మంటలు పెట్టి ఆర్పకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలు అని అటవీ అధికారులు చెబుతున్నారు.
2023లో 4,450 హెక్టార్ల అడవిలో మంటలు చెలరేగాయి. 2024లో అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అచ్చంపేట డివిజన్‌లో 382, అమ్రాబాద్‌లో 989, నాగర్జునసాగర్ పరిధిలో 7 బ్లాక్‌ల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2025లో నల్లమల అటవీ ప్రాంతంలో 1,026 హెక్టార్లలో అగ్ని ప్రమా దాలు చోటు చేసుకున్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో అగ్రి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు శాటిలైట్ వివరాలు చెబుతున్నాయి.


