Telangana Crime News: కొడుకు కొట్టాడని.. ఇంటి నుంచి వెళ్లిన తల్లి.. చివరికి శవమై ఇలా..!
Sakshi News home page

కొడుకు కొట్టాడని.. ఇంటి నుంచి వెళ్లిన తల్లి.. చివరికి శవమై ఇలా..!

Sep 18 2023 1:32 AM | Updated on Sep 18 2023 9:36 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిని కొట్టడంతో మనస్తాపానికి గురై మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఆదివారం కోయిల్‌సాగర్‌ కుడి కాల్వలో శవమై కనిపించిన ఘటన పూసల్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసల్‌పహాడ్‌కు చెందిన రాధమ్మ(45) కుమారుడు శివకుమార్‌రెడ్డి ఈ నెల 14న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

ఇలా రోజూ మద్యం తాగి ఇంటికి వస్తే కుటుంబం ఎలా గడుస్తుందని తల్లి కుమారుడిని నిలదీసింది. ఆగ్రహానికి గురైన కుమారుడు తల్లిని కొట్టాడు. ఆమె మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకి లభించలేదు. బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా లాభం లేకపోయింది.

భర్త రాజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. చివరకు అనుమానం వచ్చిన గ్రామస్తులు కోయిల్‌సాగర్‌ కుడి కాల్వకు వస్తున్న నీటిని నిలిపివేయించారు. మూడు రోజుల తర్వాత వెంకటాపూర్‌ గ్రామ శివారులో కుడి కాల్వ ముళ్లపొదలో చిక్కుకున్న రాధమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. నారాయణపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమర్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement