ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
నారాయణపేట: వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, నేలలో తేమ, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని రైతులు ప్రత్యామ్నయ పంటలను సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడుతూ వర్షాలు ఆలస్యమైనా లేదా ఆశించిన స్థాయిలో కురవకపోయినా ప్రత్యామ్నా య పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని, అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యం
రైతులు తమ పొలాల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. నీటి సంరక్షణ పద్ధతులను తప్పనిసరిగా పాటించడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేందుకు వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా వ్యవసాయ పనులను చేపట్టడం ద్వారా పంట నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు.
వరి విస్తీర్ణాన్ని తగ్గించాలి
బావులు, బోర్ల కింద వరి సాగు చేసే రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వరి సాగు విస్తీర్ణాన్ని పూర్తిగా లేదా కనీసం 25 శాతానికి తగ్గించి, మిగిలిన భూమిలో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సా గు చేయాలని తెలిపారు. తద్వారా నీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లభిస్తాయన్నారు.
వర్షాలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయ పంటలు
వర్షాలు ఆలస్యమైన సందర్భంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలు, కూరగాయలను సాగు చేసుకోవచ్చన్నారు. వర్షాలు మరింత ఆలస్యమైతే పరిస్థితులకు అనుగుణంగా కంది, పెసర, మినుములు, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, సజ్జ, రాగులు, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు.
పంటల ఎంపికలో అప్రమత్తత అవసరం
వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని డీఏఓ సూచించారు. వర్షాల పరిస్థితి, నేలలో తేమ, నీటి లభ్యత, పంట కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుని సాగు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటల ఎంపిక చేసుకుంటే వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చన్నారు.
జూలై 16–31 వరకు.. పెసర, మినుము, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, సజ్జ, రాగులు, పొద్దుతిరుగుడు, ఆముదం, తక్కువ కాలపరిమితి కూరగాయలు, తక్కువ కాలపరిమితి మొక్కజొన్న వంటి పంటలను సాగు చేసుకోవచ్చు.
ఆగస్టు 1–15 వరకు.. కంది, అలసందలు (బొబ్బర్లు), ఉలవలు, ఆముదం, తక్కువ కాలపరిమితి కూరగాయలు సాగుకు అనుకూలం.
ఆగస్టు 16–31 వరకు.. నువ్వులు వంటి తక్కువ కాలపరిమితి పంటలను సాగు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ సూచించింది.
తగినంత తేమ ఉన్నప్పుడే
విత్తనాలు వేయాలి
నీటి లభ్యతను బట్టి ఆరుతడి
పంటలు సాగు చేసుకోవాలి
రైతులకు సూచించిన పేట డీఏఓ
ఎస్.సక్రియానాయక్
పాడి–పంట


