అడ్డాకుల: మండలంలోని శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఆటో ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన భాస్కర్ కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో నివాసముంటున్నాడు. ఇటీవల స్వగ్రామంలో శుభకార్యానికి వచ్చి కుటుంబంతో కలిసి గురువారం తన ఆటోలో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద ద్విచక్ర వాహనాలు వెళ్లే దారిలో ఆటో డివైడర్ దిమ్మెలను ఢీకొన్నది. ఆటోలో ఉన్న భాస్కర్, పద్మ, యోగీశ్వరి, శ్రీరామ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం దెబ్బతిన్నది. టోల్‌ప్లాజా అంబులెన్స్ సిబ్బందికి అక్కడికి చేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం వారు హైదరాబాద్ బయలుదేరారు. ఇదిలా ఉండగా టోల్‌ప్లాజా వద్ద ద్విచక్ర వాహనాలు వెళ్లే చోట ఆటోలు వెళ్లవద్దని సూచించే బోర్డులు సక్రమంగా కనిపించడం లేదు. అందులోను ఆ దారి వద్ద భారీ లారీలను నిలుపుతుండటంతో ద్విచక్రవాహనాలు, ఆటోలపై వెళ్లే వారు అయోమయానికి గురవుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ మృతి
అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా కూలీ మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం సిద్దాపూర్ ఎస్‌ఐ అంజయ్య కథనం ప్రకారం.. అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లికి చెందిన కేసుమొల్ల లక్ష్మి(38) హైదరాబాద్‌లో కూలీ పనిచేస్తుండేది. స్వగ్రామంలో చిట్టీ డబ్బులు చెల్లించేందుకు కారులో వస్తుండగా.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో వాహనం అదుపుతప్పి సిద్దాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ నాగరాజు తీవ్రంగా గాయపడగా హైదరాబాద్‌కు తరలించారు. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు కుమారులున్నారు. ఘటనతో తుర్కపల్లిలో విషాదం అలుముకుంది. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
చిరుత దాడిలో
గేదె దూడ మృతి
గండేడ్: చిరుత దాడిలో గేదె దూడ మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని మ న్సూర్‌పల్లి బొందెగట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చి న్న వెంకటయ్య బుధవారం సాయంత్రం తన పశువులను పాకలో కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా పాకలో గేదెదూడ కన్పించలేదు. చుట్టుపక్కల వెతకగా దూడ కళేబరం కన్పించింది. చిరుత దాడి చేసి చంపినట్లుగా ఆనవాళ్లు కన్పించినట్లు రైతు గొల్లచిన్న వెంకటయ్య పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫారెస్టు అధికారుల దృష్టికి తీసుకెళ్తానని బాధిత రైతు తెలిపాడు.


