ఉపాధ్యాయులపై చర్యలు శూన్యం
● లక్ష్మీపల్లి హైస్కూల్ హెచ్‌ఎంపై
ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు
● తప్పులు చేసే వారికి అండగా నిలుస్తున్న వైనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖలో సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారుల ఉదాసీతన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కొందరు ఎన్ని తప్పులు చేసినా కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారు. బాధ్యులపై సకాలంలో విచారణ పూర్తి చేయకుండా ఉండేందుకు డీఈఓ కార్యాలయ సిబ్బందిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహ్మదాబాద్, మిడ్జిల్ కేజీబీవీల్లో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించగా.. నోటీసులతో సరిపెట్టారు తప్ప, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల తనిఖీలకు వెళ్లే సమయంలో ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని దృష్టికి వచ్చినా వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పులు చేసే వారికి అధికారులు మద్దతుగా నిలవడం జిల్లా విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గ్రామస్తులు వద్దన్నా విధులు..
దేకరకద్ర మండలం లక్ష్మీపల్లి హైస్కూల్‌లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు రెండేళ్లుగా విధులకు సరిగ్గా హాజరు కాకపోవడం.. తోటి ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం.. తరగతులను బోధించకపోవడం వంటివి చేస్తున్నాడు. ఈ విషయంపై తోటి ఉపాధ్యాయులు, ఎంఈఓ, సర్పంచ్‌తో పాటు పాఠశాల కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేని పరిస్థితి నెలకొంది. నామమాత్రంగా ఈ నెల 23లోగా విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఐదు రోజులు అతడిని హెచ్‌ఎం విధుల నుంచి తప్పించి.. గురువారం నుంచి పాత హెచ్‌ఎంనే కొనసాగించాలని మరోసారి ఆదేశాలు జారీ చేయడంపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


