
మాట్లాడుతున్న ప్రేమేందర్‌రెడ్డి
జడ్చర్ల: బీజేపీని ఎదుర్కొనేందుకు అవినీతిపరులంతా ఒక్కటవుతున్నారని, న్యాయపరంగా ఎదుర్కొనే దమ్ము లేక తొండి మాటలతో బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జడ్చర్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బూత్ సశక్తీకిరణ్, భారత రాష్ట్రపతి ప్రసంగంపై నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి మంత్రి కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు తలవంపులు తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అనర్హత వేటు నిబంధనల మేరకే జరిగిందన్నారు. ఇప్పటికీ తాను చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకుండా సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆరోపించారు. వచ్చే నెల 2 నుంచి 6 వరకు అన్ని జిల్లాకేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, పార్లమెంట్ ప్రభారీ చంద్రశేఖర్, నాయకులు భరత్‌గౌడ్, ప్రతాప్‌రెడ్డి, తిరుపతమ్మ, నాగరాజు, రాజు, సాహితి తదితరులు పాల్గొన్నారు.