మార్కెట్‌లో ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో ఇష్టారాజ్యం

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు సరుకులు అధికంగా వచ్చిన సందర్భాల్లో వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ధాన్యం, మక్కలు, అపరాలు విక్రయించేందుకు వచ్చిన తమకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇబ్బందులు..

వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి ధరలు నిర్ణయించి వెళ్లినప్పటికీ బస్తాలు నింపడం, కాంటాలు పెట్టడం, మిల్లులకు తరలించడం ఇలా ప్రతీ సందర్భంలోనూ రైతులు పడుతున్న బాధలు చెప్పలేని విధంగా ఉంటున్నాయి. ఒకానొక సందర్భంలో మహబూబాబాద్‌ మార్కెట్‌ యార్డుకు సరుకులు విక్రయించేందుకు వచ్చే కంటే ఇతర మార్కెట్‌లకు వెళితే బాగుంటుందేమోనని ఆలోచన కలిగించే విధంగా అందరూ ప్రవర్తిస్తున్నారని రైతులు పేర్కొన్నారు.

అధికంగా ధాన్యం..

ప్రస్తుతం మార్కెట్‌కు ధాన్యం అధికంగా వస్తోంది. జైశ్రీరామ్‌, ఆర్‌ఎన్‌ఆర్‌, ఎస్‌ఎం, హెచ్‌ఎంటీ, బీపీటీ ధాన్యానికి ధరలు తక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అలాగే వ్యాపారులు కొనుగోలు చేసి వెళ్లాక కూలీలు ధాన్యాన్ని బస్తాల్లో సరిగా నింపడం లేదని, తామే నింపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా కూలీలు బస్తాలు ఎత్తిన అనంతరం డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈవిధంగా ప్రతీరోజు మార్కెట్‌లో అరిగోస పడాల్సి వస్తోందన్నారు. వ్యాపారులు చెప్పిన విధంగా, కూలీలు అడిగిన మేరకు రైతులు స్పందించకుంటే మార్కెట్‌ యార్డులోనే పడిగాపులు పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ అధికారులు స్పందించి రైతుల బాధలను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సరుకులు అధికంగా వస్తే ధరలు తగ్గించి కొనుగోలు

డబ్బులు డిమాండ్‌ చేస్తున్న కూలీలు

రైతులకు తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement