ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌నకు సురేందర్‌ | - | Sakshi
Sakshi News home page

ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌నకు సురేందర్‌

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

కురవి: మండలంలోని పోలంపల్లి తండాకు చెందిన బాదావత్‌ సురేందర్‌ ప్రతిష్టాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యాడు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ 2026–2027 సంవత్సరానికి ఈ ఫెలోషిప్‌ను మంజూరు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌ డి.రాములు పర్యవేక్షణలో ఆయన రెండేళ్లపాటు పరిశోధన చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎంపిక చేసిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ‘సుస్థిర మానవ వనరుల నిర్వహణ పద్ధతులు, ఆవిష్కరణ సామర్థ్యం, సుస్థిర వ్యాపార పనితీరు’ అనే అంశంపై అధ్యయనం చేయనున్నారు. ఈ సందర్భంగా సురేందర్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం మేనేజ్‌మెంట్‌ ఫ్యాకల్టీ డీన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి, సీనియర్‌ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, పరిశోధకులు అభినందించారు. అలాగే పోలంపల్లి తండావాసులు అభినందించారు.

రైతులు వరిసాగు చేయొద్దు

డోర్నకల్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులు యాసంగిలో వరిసాగు చేయవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయచంద్ర విజ్ఞప్తి చేశా రు. మండలంలోని గొల్లచర్ల గ్రామపంచాయ తీ కార్యాలయంలో బుధవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు తగ్గుతుండడంతో రైతులు వరిసాగుకు స్వస్తి చెప్పి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని కోరారు. అమ్మపాలెం రైతు వేదికలో ఆత్మ నిర్భరత పథకం కింద రైతులకు పెసర విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో గొల్లచర్ల సర్పంచ్‌ పగిడిపాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి కె.అనిల్‌కుమార్‌, పంచా యితి కార్యదర్శి రవి పాల్గొన్నారు.

రాజకీయ ఒత్తిళ్లతో ఎంపీడీఓల బదిలీ

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని చిన్నగూడూరు, గార్ల, ఇనుగుర్తి ఎంపీడీఓలను రాజకీయ ఒత్తిళ్లతోనే జెడ్పీ సీఈఓ పురుషోత్తం బదిలీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నగూడూరు ఎంపీడీఓ సుజాతను గార్లకు బదిలీ చేశారు. గార్ల ఎంపీడీఓ మంగమ్మను చిన్నగూడూరు, ఇనుగుర్తి ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ పార్థసారథిని పెద్దవంగరకు బదిలీచేశారు. కేసముద్రం ఎంపీఓ హర్షకు ఇనుగుర్తి ఎంపీడీఓగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఏది ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు, లాగ్‌స్టాండింగ్‌తో ఉండడం, వార్డు మెంబర్ల శిక్షణ తరగతుల బిల్లులు, ఇతర బిల్లుల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం మేరకు జిల్లాలో వీరిని మాత్రమే బదిలీ చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

23న వాక్‌ ఇన్‌ కౌన్సెలింగ్‌

మహబూబాబాద్‌ రూరల్‌: కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అనుబంధ మల్యాల ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం చివరి అవకాశం ఇచ్చారని కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఆర్‌. ప్రీతం బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై టీజీఈపీ సెట్‌ రాసిన బైపీసీ విద్యార్థులు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌లో ఈ నెల 23న కౌన్సెలింగ్‌కు హాజరై సర్టిఫికెట్లు చూపించి ప్రవేశం పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 94401 30030, 81304 11879, 93808 88090 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

మహబూబాబాద్‌: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు(గురువారం) సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, అదే సమయంలో అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహశబరీష్‌, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement