విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్
నెహ్రూసెంటర్: అర్నబ్ తుపాన్ కారణంగా విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ దర్శన్‌కుమార్ సూచించారు. తుపాన్ నేపథ్యంలో బుధవారం విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ల వివరాలను విద్యుత్ అధికారులకు తెలియజేయాలన్నారు. తెగిన వైర్లను ఎట్టిపరిస్థితుల్లో ముట్టుకోవద్దని, వైర్లపై చెట్ల కొమ్మలు పడితే ప్రజలు స్వయంగా తొలగించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తుపాన్ నేపథ్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యుత్ అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల సమయాల్లో 1912కు కాల్ చేయాలన్నారు. విద్యుత్ భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఎస్‌ఈ కోరారు. ఈ సమావేశంలో విద్యుత్‌శాఖ డీఈ, ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
తొర్రూరు: పోక్సో చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పోక్సో చట్టంలోని నిబంధనలు, శిక్షలు, బాధితులకు పరిహారం, ఉచిత న్యాయ సేవలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. జడ్జి మాట్లాడుతూ.. ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే భయంతో మౌనంగా ఉండకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఉన్నత లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య, హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, న్యాయవాదులు రామకృష్ణ, అశోక్, కుమార్ పాల్గొన్నారు.
ఘనంగా గరుడవాహన సేవ
గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో గరుడవాహన సేవ ఘనంగా నిర్వహించారు. తొలుత పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయం చుట్టూ మేళతాళాల నడుమ గరుడవాహన సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారికి వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ హోమ బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. నేడు స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అజ్మీరా బన్సీలాల్, వైస్ చైర్మన్ బానోత్ అర్జున తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు అచ్యుతాచార్యులు, గోవిందాచార్యులు హర్షవర్ధన చార్యులు, కృష్ణచైతన్యచార్యులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం వడ్డించాలి
గూడూరు: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డిస్తూ, ఆరోగ్యం, పరిశుభ్రత, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని టీడబ్ల్యూ డీడీ దేశీరాంనాయక్ అన్నారు. మండలంలోని ఊట్ల మట్టెవాడ టీడబ్ల్యూ ఏహెచ్‌ఎస్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా విద్యార్థుల హాజరు, వంట గది నిల్వలు, కూరగాయలు, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యూనిఫాం, షూ ఇచ్చారా అని అడిగారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సారంగపాణి, వార్డెన్ శ్రీకాంత్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


