● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
కురవి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి ఆరోగ్య కేంద్రంలోని హాజరు పట్టికలు, మందుల నిల్వలు, రికార్డులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి స్రవంతి, డిప్యూటీ డీఎంఈఓ రాజకుమారి, డీపీఓ నీలోహన తదితరులు పాల్గొన్నారు.
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
బయ్యారం: పీహెచ్‌సీలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. మండలంలోని గంధంపల్లి పీహెచ్‌సీని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు.వైద్యాధికారి ఉస్మాన్, సీహెచ్‌ఓ జ్ఞానసుందరి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
డోర్నకల్: జిల్లాలోని ఆర్‌ఎంపీలు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రవి హెచ్చరించారు. స్థానిక బ్యాంక్ స్ట్రీట్‌లోని ప్రథమ చికిత్స కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఆర్‌ఎంపీలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు సేవలు అందించాలని సూచించారు. డిప్యూటీ డీఎంఈఓ రాజకుమార్, డీపీఓ నీలోహన, వైద్యాధికారి డాక్టర్ సాధ్విజ, డాక్టర్ మేఘన పాల్గొన్నారు.


