రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వంగ సరస్వతి(48) కూలీ పని చేసుకుంటూ జీవిస్తోంది. బుధవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న దుకాణానికి నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమె తల, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న మృతురాలి కుమార్తె గడిదాసు నవ్య ఘటనా స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి మృతిచెందడంతో బోరున విలపించింది. వాహనాన్ని గుర్తించి డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
మైలారంలో ఘటన


