డోర్నకల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. స్థానిక ఎంపీపీఎస్, కేజీబీవీలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్‌లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి సబ్జెక్ట్ పరిజ్ఞానం, చదవడం, రాయడంలో నైపుణ్యాన్ని పరీక్షించారు. లీప్ ప్రోగ్రాం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపు కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేయకపోవడంపై ఎంఈఓ ఆంగోత్ లక్ష్మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు చురుకై న భాగస్వామ్య పద్ధతుల ద్వారా బోధించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, తాగునీటి వసతి, పాఠశాల ఆవరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ రికార్డులతో పాటు విద్యార్థుల హాజరుశాతం పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు. బాలికల్లో విద్యా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠ్యాంశాలను వివరంగా అర్థమయ్యేలా బోధించాలని, ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రతీ అంశాన్ని వివరంగా చెప్పాలని సూచించారు. ఇన్‌చార్జ్ డీఈఓ శ్రీరాములు, జీఈసీఓ గాయత్రి, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, తహసీల్దార్ రాఘవరెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఎస్‌కె.మున్నీ, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యశ్రీనివాస్, మున్సిపాలిటీ మేనేజర్ నర్సింహమూర్తి ఉన్నారు.


