బయ్యారం: ఇల్లందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఇరువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికుల కథనం ప్రకారం.. పరకాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 43 మంది ప్రయాణికులతో భద్రాచలం వెళ్తుంది. ఈ క్రమంలో బయ్యారం అలిగేరు బ్రిడ్జి సమీపంలో ఇల్లందు నుంచి మహబూబాబాద్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బస్సుపైకి దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు బస్సును రోడ్డు కిందికి దింపడంతో కుడి వైపు చివరిభాగాన్ని ఢీకొట్టాడు. ఈ సమయంలో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొలిపాక శ్రీనివాస్ చేయి విరగ్గా.. గార్ల మండలం సీతంపేటకు చెందిన ధరావత్ సరోజ తలకు బలమైన గాయమైంది. వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాస్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌కు వైద్యులు రిఫర్ చేశారు. ప్రయాణికుల్లో 20 మందికి స్వల్పగాయాలు కాగా, వారిని ఇతర బస్సులో గమ్యస్థానాలకు పంపించారు.
బస్సు డ్రైవర్‌పై లారీ డ్రైవర్ దాడి
ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా ఢీ కొట్టి వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు డ్రైవర్ స్థానికుల సాయంతో వెంబడించారు. ఈ క్రమంలో లారీని ఆపిన తర్వాత లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి గాయపర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరికి తీవ్ర, 20 మందికి
స్వల్పగాయాలు
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన
పెనుప్రమాదం


