విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 19 2026 6:14 AM | Updated on Sep 19 2026 6:14 AM

ఖానాపురం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్‌పేట శివారులోని పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఏనుగల్‌ తండాకు చెందిన భూక్య శ్రీనివాస్‌(40) మానుకోటలోని టీజీటీడబ్ల్యూఆర్డీసీ గర్ల్స్‌ కాలేజీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో దబ్బీర్‌పేట శివారులో తనకున్న 2.20 గుంటల వ్యవసాయ భూమిలో మిరప తోట పెట్టేందుకు శుక్రవారం కూలీలను తీసుకెళ్లాడు. చేనులో నీరు పారించేందుకు మోటార్‌ ఆన్‌ చేయగా కరెంట్‌ లేదు. దీంతో సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫీజు తొలగిపోయి ఉండటాన్ని గమనించాడు. అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌ ఫీజు సరిచేస్తుండగా.. మెయిన్‌ లైన్‌ విద్యుత్‌ తీగలకు తగలడంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కూలీలు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వడదెబ్బతో వృద్ధుడు..

ములుగు: వడదెబ్బకు గురై మేకల సమ్మయ్య(63) అనే వృద్దుడు గురువారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగులోని నాయకపువాడకు చెందిన సమ్మయ్య కాలక్షేపం కోసం తోపుకుంట వైపుకు వెళ్లి వడదెబ్బకు గురై పడిపోగా, స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. ఆపస్మారకస్థితిలో ఉన్న సమ్మయ్యను చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ బానోతు రవిచందర్‌ పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement