కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటా పెసర్లకు ధర రూ.392 వరకు తగ్గింది. దీంతో పెసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక అడపాదడపా పెసర పంటను పండించగా, తక్కువ దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో పెసర్లకు మద్దతు ధర రూ.8,780 ఉండగా, మద్దతుకు లోబడే మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం కేసముద్రం మార్కెట్‌కు 471 బస్తాల పెసర్లు అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.8,011, కనిష్ట ధర రూ.5,869 పలికింది. గురువారం మార్కెట్‌కు 466 బస్తాల పెసర్లు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.7,619, కనిష్ట ధర రూ.3,119 పలకడం గమనార్హం. ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాకు ధర రూ.392 తగ్గడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ, తమను మోసగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మద్దతు ధరతో పెసర్ల కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
● ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాకు రూ.392 తగ్గింపు


