వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

చెరువులో చేపల వల చుట్టుకుని వ్యక్తి..

దుగ్గొండి: స్నానం చేయడానికి చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకుని అందులోనే మునిగి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లబెల్లి రవి(44) ఈనెల 16న శంభయ్యపల్లికి చెందిన ఓ రైతు వద్దకు కూలీకివెళ్లాడు. పనిపూర్తయిన అనంతరం ఇంటికి వస్తూ దారిలో ఉన్న గణేశ్‌ చెరువులో స్నానం కోసం దిగాడు. ఈ సమయంలో నీటిలోనే ఉన్న పాత చేపల వల కాలుకు చుట్టుకుంది. దీంతో బయటకు రాలేక అందులోనే మునిగి చనిపోయాడు. సాయంత్రమైనా రవి ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య ప్రేమలత పలుచోట్ల వెతికినా ఫలితం కనిపించలేదు. గురువారం ఉదయం చెరువు సమీపంలోని కొంత మంది రైతులకు రవి మృతదేహం తేలి కనిపించడంతో కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రణధీర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. మృతుడి భార్య ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో యువరైతు..

గుండె పోటుతో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పీజీతండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లావుడ్యా వెంకటేష్‌ (31) గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడికి భార్య మహిమ, కుమారుడు గణేశ్‌, కూతురు హన్సిక ఉన్నారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్‌ ..

బచ్చన్నపేట : వైరు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగలి ఓ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాచగోని అజయ్‌కుమార్‌ (27) ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం కొసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెరుమాండ్ల సిద్దయ్య వ్యవసాయ భూమి వద్ద కరెంట్‌ వైరు సరి చేయడానికి మరో ఎలక్ట్రీషియన్‌ కొండం రమేశ్‌తో కలిసి వెళ్లాడు. పొలంలో ఉండి పని చేస్తుండగా ఒక్కసారి వైరు తగిలి ఇద్దరికీ షాక్‌ వచ్చింది. దీంతో రమేశ్‌ ఎగిరి పక్కకు పడగా అజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రభాకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి పెళ్లి అయిన మూడు నెలలకే భార్య మృతి చెందింది. ఇప్పటికి ఆరు నెలలు అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement