బోరుమన్న బాలయ్యపల్లె | - | Sakshi
Sakshi News home page

బోరుమన్న బాలయ్యపల్లె

Sep 18 2026 1:51 AM | Updated on Sep 18 2026 1:51 AM

గీసుకొండ: బాలయ్యపల్లె బోరుమంది. తమ బిడ్డలను ఇద్దరిని నేరేడు చెరువు పొట్టన పెట్టుకుందని కన్నీరుమున్నీరైంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో బుధవారం వినాయక నిమజ్జనం చేయడానికి విద్యార్థులు వెళ్లగా ప్రమాదవశాత్తు ఆరుగురు నీట మునిగి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆరుగురు మృతుల్లో ఇద్దరు గీసుకొండ గ్రామ పరిధి (హామ్లెట్‌) బాలయ్యపల్లెకు చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాలయ్యపల్లెకు చెందిన రాగిరి లింగమూర్తి, అనిత దంపతులకు కూతురు, కుమారుడు గణేశ్‌(18) ఉన్నారు. గణేశ్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన నల్ల అశోక్‌, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్దార్థ(17) పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు పెద్దకంజర్లలోని శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి నేరేడు చెరువులో లోతు ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలుపడంతో వారు అదే రోజు రాత్రి అక్కడికి వెళ్లారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు విద్యార్థులకు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం రూ. రూ.5 వేల సాయం అందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని కాంగ్రెస్‌ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి తెలిపారు. అలాగే, శిరీష చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల సాయం అందించినట్లు తెలుస్తోంది.

విద్యార్థులను కబళించిన నేరేడు చెరువు

మృతుల్లో ఇద్దరు బాలయ్యపల్లె వాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement