పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల ): ఓ వృద్ధురాలిని చంపి అనారోగ్యంతో మృతి చెందినట్లు సృష్టించేందుకు యత్నించిన దంపతుల (కుమారుడు, కోడలు)ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పాలకుర్తి సీఐ బి. సుమన్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం దేవరుప్పుల పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఊర సృజన్‌కుమార్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన పెందోట వెంకటేశ్వర్లు, భార్య వనితతో పాటు తన తల్లి ఉపేంద్రను తీసుకుని వృత్తి రీత్యా బంగారు ఆభరణాలు పని చేసేందుకు నాలుగు నెలల క్రితం ఇదే జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి వలస వచ్చారు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నారు. ఈ తరుణంలో ఈ నెల 8 వ తేదీన ఉపేంద్రను అడ్డుతొలగించాలనే ఉద్దేశంతో దంపతులు ఆ వృద్ధురాలిని కొట్టి చంపారు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మబలుకుతూ అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. కాగా, మృతదేహంపై గాయాలు కనిపించడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. దీంతో హత్య విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయాందోళనకు గురైన నిందితులు.. కడవెండి సర్పంచ్ బాషిపాక రాములుకు జరిగిన విషయం వెల్లడించారు. దీంతో ఆయన నిందితులుగా భావిస్తున్న మృతురాలి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు వనితను పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పాలకుర్తి సీఐ భరత్ ఆధ్వర్యంలో ఎస్సై ఊర సృజన్‌కుమార్ విచారణ చేపట్టి జనగామ కోర్డులో హాజరు పర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు


