● టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్
హన్మకొండ అర్బన్ : టూరిస్ట్ గైడ్ అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ అన్నారు. ప్రభుత్వ మహిళా పింగిళి కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టూరిస్ట్ గైడ్ సర్టిఫికెట్ కోర్సులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ పర్యాటక సౌకర్యాలు, అభివృద్ధి–తెలంగాణ పర్యాటక ఉత్పత్తులు’ అంశంపై అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత, సాంస్కృతిక ప్రదేశాలు, సందర్శకులకు మార్గదర్శకం అందించడంలో గైడ్ పాత్రను వివరించారు. రెండు రోజుల పర్యటనకు ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని వాహనం, సమ యం, అవసరమైన వస్తువులు, సందర్శించాల్సిన ప్రాంతాలను నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని అధ్యక్షత వహించారు. సర్టిఫికెట్ కోర్సు కన్వీనర్, చరిత్ర విభాగాధిపతి కొలిపాక శ్రీనివాస్, అధ్యాపకులు పి. నరేశ్, బి. జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.


