● షాపు ఎదుట రైతుల ఆందోళన
నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌లో విక్రయించిన కోరమండల్ పొటాష్ బస్తాల్లో మట్టి కలిసిందని సోమవారం మండలంలోని కొండాయిల్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కొనుకటి రాజు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నల్లబెల్లి సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాశ్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, రైతులు మామిండ్ల మోహన్‌రెడ్డి, కొనుకటి వీరమల్లు, నాగెల్లి శ్రీనివాస్, వేల్పుల రవి.. గ్రోమోర్ సెంటర్ వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. బాధిత రైతు కథనం ప్రకారం.. రాజు గ్రోమోర్ సెంటర్‌లో ఈ నెల 12న కోరమండల్ కంపెనీకి చెందిన మూడు పొటాష్ బస్తాలు కొనుగోలు చేశాడు. అనంతరం పంటలో చల్లేందుకు సొమవారం తెరిచి చూడగా అందులో మట్టి ఉంది. దీనిపై గ్రోమోర్ నిర్వాహకులను నిలదీయగా పట్టించుకోకపోవడంతో షాపు ఎదుట ఆందోళన చేపట్టాడు. కాగా, మట్టి కలిసినట్లు అనుమానిస్తున్న పొటాష్ బస్తాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు ఏఓ బన్న రజిత తెలిపారు. నివేదికలో ఎరువు నాణ్యతపై స్పష్టత వస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.


